TG Grama Sabhalu : గ్రామసభల్లో రసాభాస, అర్హతలున్నా జాబితాల్లో పేర్లు లేవని అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం-telangana grama sabhalu four welfare scheme beneficiaries list announced people questioned official ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Grama Sabhalu : గ్రామసభల్లో రసాభాస, అర్హతలున్నా జాబితాల్లో పేర్లు లేవని అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం

TG Grama Sabhalu : గ్రామసభల్లో రసాభాస, అర్హతలున్నా జాబితాల్లో పేర్లు లేవని అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2025 04:57 PM IST

TG Grama Sabhalu : నాలుగు కొత్త పథకాలకు లబ్దిదారుల ఎంపికపై తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామసభలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అధికారులు, నేతలను గ్రామస్థులు నిలదీస్తున్నారు. గ్రామసభలు చూస్తుంటే ఇది ముమ్మాటికీ ప్రజావ్యతిరేక పాలన అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

గ్రామసభల్లో రసాభాస, అర్హతలున్నా జాబితాల్లో పేర్లు లేవని అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం
గ్రామసభల్లో రసాభాస, అర్హతలున్నా జాబితాల్లో పేర్లు లేవని అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం

TG Grama Sabhalu : రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అయితే జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో గ్రామస్థులు అధికారులను నిలదీస్తున్నారు. దీంతో పలుచోట్ల గ్రామసభలు రసాభాసగా మారాయి. అధికారులు, పోలీసులు కల్పించుకుని గ్రామస్థులకు సర్థిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పలుచోట్ల గ్రామసభలను గ్రామస్థులు బహిష్కరిస్తున్నారు. జాబితాల్లో పేర్లు ఉన్న వారు ఆనందం వ్యక్తం చేస్తుంటే...పేర్లు రాని వాళ్లు అధికారులపై ఫైర్ అవుతున్నారు. అర్హులను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్హులందరికీ పథకాలు వస్తాయని, పేర్లు రానివాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

yearly horoscope entry point

రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్

గ్రామసభల్లో ఉద్రిక్తతలపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు. సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతుందన్నారు.

"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతాం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి" - మాజీ మంత్రి హరీశ్ రావు

యావత్ తెలంగాణ ఏకమై

"మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తారు. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ పాలనను నిలదీస్తుంది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతారు. ఎంత మందిని అరెస్టులు చేస్తారు.మీ పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం"-మాజీ మంత్రి హరీశ్ రావు

Whats_app_banner

సంబంధిత కథనం