Mlc Election Nominations : ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ- పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్లు-telangana graduate teachers mlc elections nominations close with 117 candidates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Election Nominations : ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ- పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్లు

Mlc Election Nominations : ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ- పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్లు

HT Telugu Desk HT Telugu
Updated Feb 10, 2025 11:01 PM IST

Mlc Election Nominations : ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ వేశారు.

 ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ- పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్లు
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ- పట్టభద్రుల స్థానానికి 100 మంది నామినేషన్లు

Mlc Election Nominations : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ వేశారు. 11న నామినేషన్లను పరిశీలిస్తారు.‌ 12, 13 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు చివరి రోజు భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి.‌ పట్టభద్రుల స్థానానికి 51 మంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డితో పాటు మొత్తం 100 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు 8 మంది నామినేషన్ వేశారు. ఆరు రోజుల్లో టీచర్స్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్య తో పాటు 17 మంది నామినేషన్ వేశారు. చివరి రోజు కాంగ్రెస్ బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్ దాఖలు చేశారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ టీచర్స్ అభ్యర్థి మల్క కొమురయ్య సైతం భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండగా ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన కరీంనగర్ కు చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా ప్రతినిధి యాదగిరి శేఖర్ రావు పోటాపోటీ ర్యాలీలతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.‌ ర్యాలీలతో కరీంనగర్ సందడిగా మారింది.

కదం తొక్కిన కాంగ్రెస్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు సాగిన ర్యాలీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ తో పాటు మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాల పార్టీ అని, నిరుద్యోగులకు బాసటగా ఉన్న పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.‌ పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని తెలిపారు. పదేళ్ళలో 50 వేల ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బారతదేశ చరిత్రలో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

విద్యావ్యవస్థలో మార్పులు

విద్యావ్యవస్థను మార్పు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రుల కోసం అనేక నిర్ణయాలు తీసుకుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గవర్నమెంట్ టీచర్లకి ప్రమోషన్స్ ఇచ్చాం...జీవన్ రెడ్డిని ఎలా గెలిపించారో నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రులు కోరారు. విద్యావవస్థలో మార్పు రావాలని, పట్టభద్రులందరికి ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ అర్బన్ నక్షలైట్లను ప్రోత్సహిస్తుందని బీజేపీ అంటుందని, మాది ప్రజాస్వామిక పార్టీ అని బీజేపీలా మతతత్వ పార్టీ కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.‌

స్వల్ప ఉద్రిక్తత

ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రుల వాహనాలను కలెక్టరేట్ లోకి అనుమతించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆరుగురు మంత్రులు, పీసీసీ చీఫ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడు వాహనాలలో కలెక్టరేట్ లోకి వెళ్ళడంతో వాళ్ళ వాహనాలకు ఎలా అనుమతిస్తారంటూ పోలీసులను నిలదీసి బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

మూడుకు మించి వాహనాలు వెళ్లాయంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అభ్యంతరం తెలిపారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు నలుగురు మాత్రమే వెళ్లాల్సి ఉండగా చాలామంది లోపలికి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం