జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చటంతో పాటు… చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. శిబు సోరెన్ జ్ఞాపకార్థంగా హైదరాబాద్ లో శిబూసోరెన్ భవన్ ను నిర్మిస్తామని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వ నిధులతో ఈ నిర్మాణం చేస్తామని చెప్పారు.
బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకున్న శిబూ సోరెన్ తన జీవితాంతం జార్ఖండ్ ప్రజల కోసం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 26 ఏళ్లు పోరాడారన్నారు. జార్ఖండ్ ఏర్పాటు తర్వాతనే…తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలమనే నమ్మకాన్ని పొందారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణలో పర్యటించి ప్రజలకు అవసరమైన చోట సహాయం అందించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. సోరెన్ కుటుంబానికి కాంగ్రెస్ కుటుంబమంతా అండగా ఉంటుందన్నారు.
శిబూ సోరెన్ అంత్యక్రియలు ఆగస్టు 5న రామ్ గఢ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్రాలో జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ జీవితంలో…. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు.మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రితో సహా కీలక శాఖలను నిర్వహించారు.