Warangal Bhadrakali Lake : భద్రకాళి చెరువులో 'ఐలాండ్' ప్రతిపాదన..! సర్కార్ ప్లాన్ ఇదేనా..?
ఓరుగల్లు భద్రకాళి చెరువును సుందరీకరణ చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా చెరువులోని నీటిని ఖాళీ చేయగా.. ద్వీప స్వరూపం బయటకు వచ్చింది. . దీంతో మరోసారి ఐలాండ్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.
చారిత్రక నేపథ్యం ఉన్న భద్రకాళి చెరువులో ఐలాండ్ ను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొన్నేళ్ల కిందటనే భద్రకాళి చెరువులో ఐలాండ్ అభివృద్ధి కోసం కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) ప్రణాళికలు రచించగా.. అది కాస్త డీపీఆర్ దశలోనే ఆగిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా సుందరీకరణ కోసం చెరువును ఖాళీ చేసిన నేపథ్యంలో చెరువు మధ్యలో ద్వీప స్వరూపం బయటకు వచ్చింది. దీంతో మరోసారి ఐలాండ్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇప్పటికే భద్రకాళి ఆలయాన్ని ఒక టూరిజం సర్క్యూట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. చెరువు మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేసి, భద్రకాళి బండ్ కు అనుసంధానించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
అప్పట్లోనే రూ.2 కోట్లతో డీపీఆర్!
గతంలో భద్రకాళి చెరువులోని నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు ద్వీపం స్వరూపం, స్వభావం బయట పడింది. దీంతో దానిని గమనించిన అప్పటి అధికారులు ఆ దిబ్బ మీదకు వెళ్లి క్షుణ్నంగా పరిశీలించారు. ఆ దిబ్బను మొత్తం పరిశుభ్రం చేసి, అక్కడ కొంత తవ్వకాలు చేపట్టగా.. కొన్ని ప్రాచీన శిల్పాలు బయట పడ్డాయి. అంతేగాకుండా ఇక్కడ ఆదిమానవుల ఆనవాళ్లు కూడా ఉన్నాయని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. కాగా ఇక్కడ పరిస్థితిని పరిస్థితిని పరిశీలించిన అధికారులు దిబ్బను ద్వీపంగా మార్చి, అక్కడే ధ్యాన మందిరం నిర్మాణానికి అనువుగా ఉందనే నిర్ణారణకు వచ్చారు.
అనంతరం కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆద్వర్యంలో ఐలాండ్ డెవలప్ మెంట్ కు ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ మేరకు దాదాపు రూ.2 కోట్ల నిధులతో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశారు. కానీ ఆ తర్వాత క్రమంలో వర్షాల వల్ల చెరువు నీటితో పూర్తిగా నిండిపోవడం, ఐలాండ్ వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఐలాండ్ డెవలప్ మెంట్ ప్రతిపాదన కాస్త కనుమరుగైంది. అంతేగాకుండా అక్కడ ధ్యాన మందిరం నిర్మాణ ప్రతిపాదన కూడా తెరచాటుకు వెళ్లింది.
కేబుల్ బ్రిడ్జి ఏర్పాటైతే టూరిస్ట్ సర్క్యూటే…
ఇప్పుడు భద్రకాళి చెరువు పూడికతీత, సుందరీకరణ కోసం చెరువును ఖాళీ చేయడంతో మరోసారి అక్కడ ద్వీపం బయటకు వచ్చింది. దీంతో మరోసారి ఐలాండ్ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కాగా ఇప్పటికే ఆ చెరువుకు రెండు వైపులా భద్రకాళి బండ్ ఏర్పాటవుతుండగా.. మరోవైపున్న ఆలయ కట్టను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పుడు ఐలాండ్ డెవలప్ మెంట్ పనులు చేపట్టి, అక్కడికి, భద్రకాళి బండ్, మాఢ వీధులను కలిపేలా కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఈ చెరువే గొప్ప టూరిస్ట్ సర్క్యూట్ గా విరాజిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐలాండ్ లో ధాన్యం మందిరం నిర్మిస్తే లక్నవరాన్ని మించిన పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుందని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా గతంలో రూపొందించిన డీపీఆర్‌ను ప్రస్తుత అవసరాలు, ఆలోచనలకు తగ్గట్టుగా సవరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
కాగా గతంలోనే భద్రకాళి ఐలాండ్ డెవలప్ మెంట్ కు రచించిన ప్రతిపాదనలు నిధుల లేమి కారణంగా తెర మరుగవగా.. ఇప్పుడైనా ప్రభుత్వం తగిన చొరవ తీసుకుని భద్రకాళి ఐలాండ్ ను అభివృద్ధి చేయాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి, వరంగల్)
టాపిక్