సంతాన సాఫల్య కేంద్రాలపై సర్కార్ ఫోకస్ - తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు-telangana govt forms committee to inspect private ivf clinics fertility centres in state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సంతాన సాఫల్య కేంద్రాలపై సర్కార్ ఫోకస్ - తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సంతాన సాఫల్య కేంద్రాలపై సర్కార్ ఫోకస్ - తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలో ప్రైవేట్ ఐవీఎఫ్ క్లినిక్ల్ లు, ఫెర్టిలిటీ సెంటర్లపై తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 10 రోజుల్లో నివేదికను అందజేయనుంది.

సంతాన సాఫల్య కేంద్రాలపై తనిఖీలు

ఐవీఎఫ్, సరోగసీ ముసుగులో నడుస్తున్న శిశువుల విక్రయ రాకెట్ హైదరాబాద్ పోలీసులు ఛేదించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ క్లినిక్లు, సంతానోత్పత్తి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ప్రభుత్వం శనివారం కమిటీని ఏర్పాటు చేసింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పర్యవేక్షించే ఈ కమిటీ … సంతాన సాఫల్య కేంద్రాల సేవల విషయంలో… చట్టపరమైన, క్లినికల్ మరియు నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రంలో కొన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) క్లినిక్ లు, సంతానోత్పత్తి కేంద్రాలు…. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021, సరోగసీ (రెగ్యులేషన్) చట్టం 2021 నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

నిర్దేశిత నైతిక మార్గదర్శకాల ఉల్లంఘనలు, తప్పనిసరి రిజిస్ట్రేషన్ లేకపోవడం, గేమెట్ డొనేషన్, పిండం బదిలీ, సరోగసీ ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియల్లో పారదర్శకత లేకపోవడం వంటి ఆందోళనలు కూడా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.

ఏఆర్టీ, సరోగసీ చట్టాల ఉల్లంఘనల నేపథ్యంలో ప్రైవేట్ ఐవీఎఫ్ క్లినిక్లు, ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా సరైన రిజిస్ట్రేషన్, రోగి సమ్మతి, గేమేట్ సోర్సింగ్ మరియు విధానపరమైన డాక్యుమెంటేషన్ నిర్వహించబడుతుందో లేదో వంటి పలు విషయాలను కమిటీ నిర్ధారిస్తుంది.

10 రోజుల్లో నివేదిక….

తప్పు చేసిన క్లినిక్ లపై గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఎఫ్ ఐఆర్ లు, గతంలో తీసుకున్న శాఖాపరమైన చర్యలపై డేటాను ఈ కమిటీ విశ్లేషిస్తుంది. ఓసైట్ /స్పెర్మ్ దాతలు, సరోగేట్ మరియు గ్రహీత జంటలతో సహా బాధిత బాధితుల సంఖ్య వంటి వివరాలను కూడా సేకరించనుంది. ఈ ఉల్లంఘనలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ అధికారులు లేదా మెడికల్ కౌన్సిల్ వంటి నియంత్రణ సంస్థల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఈ కమిటీ విచారణ జరపనుంది. కమిటీ సమగ్ర నివేదికను రూపొందించి… 10 రోజుల్లో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

కఠిన చర్యలు తీసుకోవాలి - వైద్యారోగ్యశాఖ మంత్రి

ఐవీఎఫ్‌, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం అవకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఐవీఎఫ్ క్లినిక్‌లలో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సభ్యులుగా కమిటినీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.