Telangana Revenue System : మళ్లీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు…! త్వరలోనే నియామకం, 7 ముఖ్యమైన అంశాలు
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థలో మరోసారి కీలక మార్పులు రానున్నాయి. త్వరలోనే కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రాబోతుంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవహారాలను నిర్వహించేందుకు Village Level Officerర్లను నియమించనున్నారు. ఈ దిశగా సర్కార్ కసరత్తు ప్రారంభించింది.
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూ భారతి చట్టానికి ఆమోదముద్ర పడిన నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు సిద్ధమైంది. గతంలో పని చేసిన ఉద్యోగులను తిరిగి రప్పించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చింది.
రెవెన్యూ వ్యవస్థలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలు తెలపాలని ఇటీవలే ప్రకటన కూడా డారీ చేసింది. ఇందుకు డిసెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు… మళ్లీ చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగా… వారందర్నీ వేర్వురు శాఖల్లో సర్దుబాటు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన జారీ చేయగా.. వీరిలో కొందరు రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రతి గ్రాామానికి రెవెన్యూ అధికారి…!
రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయానికి వచ్చింది. గతంలో మాదిరిగా వీఆర్వో, వీఆర్ఏ లు కాకుండా… కేవలం ఒక్క అధికారే ఉండనున్నారు. విలేజ్ లెవర్ ఆఫీసర్ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పేరుతో వీరిని రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సర్కార్ నిర్ణయం వెనక కారణాలేంటి…?
- రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను 2020 సెప్టెంబర్ లో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్నుంచి… గ్రామస్థాయిలో భూ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేకంగా అంటూ సిబ్బంది ఎవరూ లేరు. ప్రతిది తహశీల్దార్ కార్యాలయమే పర్యవేక్షిస్తూ వస్తోంది.
- రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు క్లస్టర్ల వారీగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అదే పని ఒత్తడి కారణంగా… క్షేత్రస్థాయిలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
- విద్యార్థుల ధ్రువపత్రాలే కాకుండా ప్రధానంగా… రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారంటూ లేకపోవటంతో… మండల ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
- ఈ క్రమంలోనే గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారిని నియమించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు భూ భారతి చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురానుంది. ఇందులో ఉన్న అంశాలను అమలు చేయాలంటే… క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారి ఉండాల్సిదేనన్న అభిప్రాయానికి వచ్చింది.
- రాబోయే సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమించాలని సర్కార్ నిర్ణయించింది. ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది.
- రెవెన్యూ అధికారుల నియామకంతో ప్రజలకు ఉండే ఇబ్బందుల పరిష్కారం సులవుగా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి వచ్చే జనవరిలో కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
- పునరుద్ధరణలో భాగంగా ప్రతి గ్రామానికి కేవలం ఒక రెవెన్యూ అధికారి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే వీరిని జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ గా నియమిస్తారా..? లేక గతంలో ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గానే పిలుస్తారా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. మరోవైపు విలేజ్ లెవల్ ఆఫీసర్ పేరుతో వీరిని నియమించే అవకాశం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది.
సంబంధిత కథనం