TG Govt Schools : బడి పిల్లలకు సర్కార్ శుభవార్త, కొత్తగా 206 ప్రభుత్వ పాఠశాలలు!-telangana govt decided to reopen 206 schools closed in earlier govt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Schools : బడి పిల్లలకు సర్కార్ శుభవార్త, కొత్తగా 206 ప్రభుత్వ పాఠశాలలు!

TG Govt Schools : బడి పిల్లలకు సర్కార్ శుభవార్త, కొత్తగా 206 ప్రభుత్వ పాఠశాలలు!

HT Telugu Desk HT Telugu
May 28, 2024 08:25 PM IST

TG Govt Schools : తెలంగాణలో మొత్తం 265 గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు లేని కారణంగా ఈ స్కూళ్లను మూసివేశారు. వీటిల్లో మెజార్టీ పాఠశాలలను తిరిగి ఓపెన్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

బడి పిల్లలకు సర్కార్ శుభవార్త, కొత్తగా 206 ప్రభుత్వ పాఠశాలలు!
బడి పిల్లలకు సర్కార్ శుభవార్త, కొత్తగా 206 ప్రభుత్వ పాఠశాలలు!

TG Govt Schools : తెలంగాణలో మొత్తం 265 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని విద్యాశాఖ అధికారులు లెక్కలో తేలింది. విద్యార్థులు లేని కారణంగా గత ప్రభుత్వ హయంలో మూతబడ్డ పాఠశాలలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మెజారిటీ పాఠశాలలను తిరిగి ఓపెన్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరో వైపు ఇప్పటివరకు అసలు పాఠశాలలు లేని గ్రామాల్లో కొత్తవి కట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రతీ ఊరులో తప్పకుండా బడి ఉండాలన్న సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో మూతపడ్డ పాఠశాలల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే గతేడాది డిసెంబర్ లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా నూతన పాఠశాలల ఏర్పాటుపై వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ పాఠశాల నిమిత్తం పక్క గ్రామానికి వెళ్లే దుస్థితి రాకుండా ప్రతీ గ్రామ పంచాయతీల్లో ఓ పాఠశాల తప్పనిసరిగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. దీంతో గత నాలుగైదు నెలలుగా సీఎం ఆదేశానుసారం విద్యాశాఖ అధికారులు మూసివేసిన పాఠశాలల పునరుద్ధరణకు కసరత్తులు చేస్తున్నారు.

నల్గొండలో కొత్తగా 24 పాఠశాలలు

రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా......265 గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు లేవని తేలింది. వీటిలో 206 గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా అవసరమని విద్యాశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో పాఠశాలల ఏర్పాటుకు అవసరం లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో 206 గ్రామ పంచాయతీల్లో కొన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉండగా... మరికొన్ని పునరుద్ధరణ చేయాల్సి ఉందని అధికారులు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాల్లో కొత్తగా 24 పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21, వరంగల్ జిల్లాలో 16 నూతన పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 గ్రామ పంచాయతీల్లో అసలు పాఠశాలలు లేవని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో 24 గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు లేకపోగా.... అందులో 12 గ్రామాల్లో అసలు కొత్త బడులు అవసరం లేదని వెల్లడించారు.

1748 ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్ రోల్

హైదరాబాద్, మేడ్చల్, ఆసిఫాబాద్ జిల్లాలు మినహా ప్రతి జిల్లాల్లోనూ ఒకటి కన్నా ఎక్కువ స్కూళ్లు మూతపడినట్టు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. గ్రామాల్లో కొత్త పాఠశాలలను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్ లో జరిగే బడిబాటలో భాగంగా ఆయా గ్రామాల్లో పిల్లలను గుర్తించి వారికి పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులనే కొత్త బడుల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యాశా పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో భాగంగా గ్రామంలో పాఠశాల ఉండాలని ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఎక్కడ పాఠశాల అవసరం? పిల్లలు ఎన్రోల్మెంట్ తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి ఆ గ్రామానికి దగ్గరగా ఉంటే సదరు పాఠశాలలో ఉపాధ్యాయుని సర్దుబాటు చేసేలాగా కసరత్త చేస్తున్నామని, ప్రస్తుతం 1748 పాఠశాలలో జీరో ఎన్రోల్ ఉందని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

సంబంధిత కథనం