Dharani Portal Committee : ధరణి పోర్టల్‌పై దృష్టిపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సమస్యల అధ్యయనంతో పాటు పోర్టల్ లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది.
కన్వీనర్‌గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ వ్యవహరించనున్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణుడు మా భూమి సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ధరణి పోర్టల్ ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశించింది.
ధరణి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా కూడా పలు ప్రకటనలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకువస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడుగులెస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి…. సమీక్షలు నిర్వహించారు. పోర్టల్ రూపకల్పనతో పాటు రైతుల సమస్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే…. ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటైంది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టును పరిగణనలోకి తీసుకొని…. పలు కీలక నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం.
• కాగితాల నుండి కంప్యూటర్లకు ఎక్కిన భూమి/రెవెన్యూ రికార్డులే ధరణి. అప్పటి 1బి రికార్డే ఇప్పటి ధరణి.
• 80వ దశకంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సి.ఎల్.ఆర్, ఆ తరువాత వచ్చిన ఎన్.ఎల్.ఆర్.ఎం.పి, ఇప్పుడు అమలులో ఉన్న డి.ఐ.ఎల్.ఆర్.ఎం.పి. పథకాలు భూమి రికార్డులను కంప్యూటరీకరించాలి అంటున్నాయి. భూమి రికార్డులు కాగితాల్లో ఉండొద్దు, కంప్యూటర్లోనే ఉండాలి అని నిర్దేశిస్తున్నాయి.
• భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి. భూమి పై హక్కులు వచ్చిన వెనువెంటనే రికార్డు మారాలి. అంతిమంగా భూమి రికార్డుకు ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ తేవాలి అనేది ఈ పథకాల లక్ష్యాలు.
• ఇందులో భాగంగా వచ్చినవే ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన 'వెబ్ ల్యాండ్', తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన 'మా భూమి', ఇప్పుడున్న 'ధరణి'.
-కాగితాల్లో ఉన్న రికార్డు కంప్యూటర్ కు ఎక్కాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
- రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సులభతరం, వేగవంతం అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ఒకేరోజు ఒకేచోట నిమిషాల్లో అవుతున్నాయి.
- ఈ రికార్డు ఆధారంగానే రైతులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.
- ధరణిలో చాలా వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఊరిలో వంద మందికి పైగా రైతులకు సంబందించిన భూమి వివరాలు ధరణిలో సరిగా నమోదు కాలేదు. ధరణిలో దాదాపు 45 రకాల సమస్యలు ఉన్నాయి.
- ధరణి సమస్యల పరిస్కారం క్లిష్టంగా, రైతులకు భారంగా మారింది.
సంబంధిత కథనం