NO Entry to CBI : సీబీఐకు తెలంగాణలో నో ఎంట్రీ….
NO Entry to CBI టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరిన బీజేపీకి , తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ సిబిఐ దర్యాప్తుకు సాధారణ సమ్మతిని నిరాకరిస్తూ రెండు నెలల క్రితమే హోంశాఖ జారీ చేసిన జీవోను హైకోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిబిఐ దర్యాప్తుకు అవకాశం లేదని తేలిపోయింది.
NO Entry to CBI తెలంగాణలో సీబీఐ దర్యాప్తుకు అనుమతులు నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐకు సాధారణ సమ్మతి నిరాకరిస్తూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెలుగు చూశాయి.

బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆగష్టు 30న తెలంగాణ హోంశాఖ జారీ చేసిన జీవో నంబర్ 51 ను ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. జీవో 51 ద్వారా సిబిఐకు గతంలో జారీ చేసిన సాధారణ అనుమతులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆగష్టు 30న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి ఘర్షణ వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై సిబిఐను ప్రయోగిస్తుందనే అనుమానాలతో సిబిఐకు గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జనరల్ కన్సెంట్ అనుమతుల్ని ఉపసంహరించు కుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం వెనుక ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వెలుగు చూసి లిక్కర్ స్కాంలో టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల పేర్లు వెలుగు చూశాయి. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. మద్యం సిండికేట్లపై సిబిఐ, ఈడీలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో పలువురు హైదరాబాదీలను సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సిబిఐ దర్యాప్లు, సోదాలు నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పలేదు.
తాజాగా నలుగురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలపై పోలీసులు వలపన్ని నిందితుల్ని పట్టుకోవడంతో సిబిఐ వ్యవహారం వెలుగు చూసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలని బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సిబిఐ దర్యాప్తుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు రెండు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ముందస్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సిబిఐకు సాధారణ సమ్మతి ఉపసంహరించినట్లు స్పష్టమవుతోంది.
ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన సిబిఐ రాష్ట్రాల పరిధిలో దర్యాప్తు చేయాలంటే అయా రాష్ట్రాల అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి తలెత్తినపుడు రాష్ట్రాలు సిబిఐ దర్యాప్తకు అనుమతులు నిరాకరించడం పరిపాటైంది. గతంలో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సైతం కేంద్రంతో గొడవపడి సిబిఐకు అనుమతులు రద్దు చేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ తరహా పరిస్థితులు గతంలో కూడా ఏర్పడ్డాయి.
టాపిక్