TG Rythu Bharosa : రైతులకు శుభవార్త.. మార్చి మొదటి వారంలో బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి!
TG Rythu Bharosa : రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధుల విడుదల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన అందరికీ నిధులు జమ చేయాలని స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మంత్రులు స్పష్టం చేశారు.

అర్హులైన అన్నదాతలకు మార్చి నెల మొదటి వారంలోగా.. రైతు భరోసా సాయం విడుదల చేయాలని.. ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విడతల వారీగా నిధులు విడుదలైనా.. ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సచివాలయంలో రైతు భరోసాపై ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
అధికారుల వివరణ..
ఇప్పటి వరకు మూడు ఎకరాలున్న వారికి సాయం అందించామని అధికారులు మంత్రులకు వివరించారు. కొత్త పాస్ పుస్తకాలున్న వారి బ్యాంకు ఖాతాల పరిశీలన జరుగుతుందని.. వారికి నిధులు జమ కాలేదని చెప్పారు. అయితే.. కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతుల ఖాతాల్లో వెంటనే నిధులు చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి.. రైతుభరోసా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
సాయం అందేలా..
'మొదట ఎకరం వరకు.. ఆ తర్వాత ఎకరం నుంచి రెండు ఎకరాలు.. ఆ తర్వాత రెండు నుంచి మూడు ఎకరాలు ప్రాతిపదికన రైతు భరోసా కింద నిధులు జమయ్యాయి. దీంతో కొంత మందికే సాయం అందిందని మిగిలినవారు అనుకుంటున్నారు. నాలుగు, ఐదు, అంతకంటే ఎక్కువ ఎకరాలున్న వారు తమవంతు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారందరికీ వెంటనే సాయం అందేలా నిర్ణయం తీసుకున్నాం' అని మంత్రి తుమ్మల వివరించారు.
నిధులు జమ చేయాలి..
'నాలుగు, ఐదు ఎకరాలున్న వారికి సైతం మూడు ఎకరాల మేరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తాం. ఒక రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంటే.. అతనికి వెంటనే మూడు ఎకరాలకు సాయం అందుతుంది. మరో రైతుకు ఐదు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాలకు తొలి విడతనే భరోసా సాయం విడుదల చేస్తాం. భూముల పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట.. రెవెన్యూ అధికారులు సర్వే చేసి, పాస్ పుస్తకాలను సవరించి నిధులు జమ చేయాలి' అని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఇంకా జమ కాలేదు..
కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నా.. వారికి ఇంకా నగదు జమ కాలేదు. పాత రైతుల ఖాతాల్లోనూ పూర్తి స్థాయిలో నగదు రాలేదు. మొదటి విడతగా రెండెకరాల లోపు భూమి ఉన్న రైతులు, రెండో విడతగా రెండకరాలు ఉన్న వారి బ్యాంకుల్లో నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డబ్బులు రానివారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.