Telangana Secretariat : ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రోజే ఎందుకంటే ?-telangana government to inaugurate new secretariat on february 17th on cm kcrs birthday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Government To Inaugurate New Secretariat On February 17th On Cm Kcrs Birthday

Telangana Secretariat : ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రోజే ఎందుకంటే ?

HT Telugu Desk HT Telugu
Jan 15, 2023 03:53 PM IST

Telangana Secretariat : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయం (twitter)

Telangana Secretariat : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ ను ఫిబ్రవరి 17న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు... ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కావటం విశేషం. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ జన్మదినం రోజున సెక్రటేరియట్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

వాస్తవానికి... సంక్రాంతికే సచివాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో సర్కార్ మొదట్లో ఉంది. అయితే ఈ నెల 18వ తేదీ కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండడంతో పాటు ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో పార్టీ నాయకత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఇదే సమయంలో సచివాలయానికి సంబంధించిన తుది పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.... ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.

మరోవైపు... సచివాలయ భవనానికి సంబంధించిన సివిల్ వర్క్స్ పూర్తి కాగా... ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం, పోర్టికో, తదితర పనులు జరుగుతున్నాయి. భవనం ఆవరణ, ముందు ఉన్న లాండ్ స్కేప్ గార్డెన్ల పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోగా పనులు పూర్తి చేసేందుకు మూడు షిఫ్ట్ ల్లో పనులు చేస్తున్నారు. నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న రహదార్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.... తరచూ సచివాలయ పనులను పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడంతో పాటు వేగవంతం కోసం ఆదేశాలు ఇస్తున్నారు.

తెలంగాణ కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా కొత్త సెక్రటేరియట్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనం... ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేస్తున్నారు. సీఎం కార్యాలయానికి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన అంతస్తుల్లో మంత్రుల ఛాంబర్లు, వివిధ విభాగాలు, సహాయక సిబ్బంది, సమావేశ గదులు, సాధారణ పరిపాలనా విభాగం కోసం కేటాయిస్తారు. దిగువ అంతస్తులలో పెద్ద సమావేశ మందిరాలు, వీవీఐపీల వెయిటింగ్ ప్రదేశాలు, పోలీసు నిఘాలు, ఇంటెలిజెంట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (IBMS) రికార్డ్ రూమ్‌లు, స్టోర్‌లు మొదలైనవి ఉంటాయి.

భవనం మెుత్తం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మితమవుతోంది. అన్ని లిఫ్టులు, మెట్లు, యుటిలిటీ గదుల రూపకల్పన ప్రణాళిక ప్రకారం చేశారు. ప్రధాన ప్రవేశం తూర్పు వైపున ఉంది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. ముఖ్యమంత్రి ఛాంబర్‌, క్యాబినెట్ సమావేశ మందిరం, ముఖ్య కార్యదర్శి, సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శులు, సహాయక సిబ్బంది, VIP వేచి ఉండే ప్రదేశాలు సైతం చూసేందుకు ముచ్చటగా ఉంటాయి.

IPL_Entry_Point