తెలంగాణ కొత్త భూచట్టం రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ‘భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా… గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ నూతన చట్టాన్ని…. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు ఉండనున్నాయి.
ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా కొత్త చట్టంతో పాటు భూ భారతి పోర్టల్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ధరణి’ స్థానంలో భూ-భారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఆ తేదీ తర్వాత.. భూ భారతి పోర్టల్ ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతాయి.
భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూ భారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారు. మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి ఆరుకు కుదించారు. ఈ నూతన చట్టం ప్రకారం మ్యుటేషన్‌కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే… ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.
ఈ ఏడాది జనవరి 9న ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్(RoR)-2025 భూ భారతి’ చట్టం రూపం దాల్చింది. ఈ కొత్త చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా కసరత్తు చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలోని అధికారి నుంచి పైస్థాయిలోని ఉన్నతాధికారి వరకు చట్టం అమలుపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. అందించాల్సిన సేవలు, ఎదురయ్యే సమస్యలపై లోతుగా చర్చించింది. వీటన్నింటి తర్వాతే…. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఏప్రిల్ 14 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్‌ప్లే చేస్తారు. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం… గ్రామకంఠం, ఆబాదీలపై కూడా హక్కులను కట్టబెట్టనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 11 కాలమ్‌లతో కొత్త పహాణీని ఏర్పాటు చేయనున్నారు.
ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో ఆర్డీవోకు అప్పీల్ చేసుకునే వీలు ఉంటుంది. భూముల క్రయ విక్రయాల విషయంలో తహసీల్దార్- జాయిట్ సబ్ రిజిస్ట్రార్‌కు సమర్పించే భూ దస్త్రాలతో పాటే భూమి సర్వే, సబ్ డివిజన్ సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది. సర్వే మ్యాప్ లను కూడా భద్రపరుస్తారు.రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు. ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు.రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిస్కారానికి అవకాశం కల్పిస్తారు.