TG Drug Control : మాదకద్రవ్యాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు.. 9 ముఖ్యమైన అంశాలు-telangana government takes strict action to curb drug abuse 9 key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Drug Control : మాదకద్రవ్యాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు.. 9 ముఖ్యమైన అంశాలు

TG Drug Control : మాదకద్రవ్యాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు.. 9 ముఖ్యమైన అంశాలు

TG Drug Control : మాదకద్రవ్యాల వినియోగం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విక్రయించేవారి ఇళ్లకు వాటర్, కరెంట్ సప్లై నిలిపివేయనుంది.

మాదకద్రవ్యాల కట్టడి (istockphoto)

మాదకద్రవ్యాల వినియోగం.. ఎన్నో కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం వల్ల నేరాలు పెరుగుతున్నాయి. యువత నేరాలకు పాల్పడటానికి ఇది ఒక ప్రధాన కారణం అని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

9 ముఖ్యమైన అంశాలు..

1.తెలంగాణ నుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని పారదోలేందుకు.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. వాటిని అమ్మేవారి ఇళ్లకు తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.

2.ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి చట్ట సవరణకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్‌ సరఫరాదారులను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షలు విధించడంతోపాటు.. వ్యవస్థీకృతంగా దీన్ని కొనసాగిస్తున్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు.

3.ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడ్డ నిందితులకు వెంటనే బెయిల్‌ రాకుండా చూడటమే కాకుండా.. సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చేసి, వీలైనంత ఎక్కువకాలం వారు జైల్లో ఉండేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

4.తెలంగాణలో డ్రగ్స్‌ను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం.. యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. రూ.252 కోట్లతో అవసరమైన వాహనాలు ఇతర సదుపాయాలు సమకూర్చింది. ఈ బ్యూరో గత ఏడాది 1,942 కేసులు నమోదు చేయగా 4,682 మందిని అరెస్టు చేసింది.

5.టీజీఏఎన్‌బీ ఏర్పాటు కాకముందు ఆబ్కారీతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన డీఆర్‌ఐ, ఎన్సీబీ అధికారులు అడపాదడపా డ్రగ్స్‌ పట్టుకునేవారు. కేసులు పెడుతున్నా.. వీటి రవాణా ఆగకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

6.డ్రగ్స్‌తో పట్టుబడ్డవారు బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల పీడీ చట్టం కింద హైదరాబాద్‌లో అరెస్టు చేసిన అంగూరీబాయ్‌పై 30 కేసులు ఉన్నాయి. అరెస్టు కావడం, బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ మత్తుమందుల వ్యాపారం చేయడం ఆమె నైజం.

7.ఇతర రాష్ట్రాలకు చెందినవారు బెయిల్‌ దొరగ్గానే పరారవుతున్నారు. ఇటువంటి వారిని కట్టడి చేసేందుకు వారి ఆస్తులు కూడా జప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులకు చెందిన రూ.55.8 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. మరో 122 మందివి జప్తు చేసే ప్రక్రియ నడుస్తోంది.

8.మత్తు మందుల రవాణాకు అడ్డుకట్ట పడాలంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇటువంటి వారి ఇళ్లకు విద్యుత్తు, నీటి సరఫరా కనెన్షన్లు కట్‌ అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

9.అరెస్టైన తర్వాత బెయిల్‌ దొరికేలోపే న్యాయ విచారణ పూర్తిచేసి శిక్షలు పడేలా చేయగలిగితే ఫలితం ఉంటుందనేది అధికారుల ఆలోచన. అవసరమైతే ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు కూడా ప్రతిపాదించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.