TG Ration Cards : పాత రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇబ్బంది లేదు!-telangana government takes key decision on old ration cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ration Cards : పాత రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇబ్బంది లేదు!

TG Ration Cards : పాత రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇబ్బంది లేదు!

Basani Shiva Kumar HT Telugu
Jan 17, 2025 12:29 PM IST

TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత రేషన్ కార్డులను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులను తొలగించబోమని స్పష్టం చేశారు. పదేళ్లుగా కొత్త కార్డులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

తెలంగాణ రేషన్ కార్డులు
తెలంగాణ రేషన్ కార్డులు

జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు గ్రామాల్లో సర్వే జరుగుతుందని.. మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీ గురించి కీలక విషయాలు వెల్లడించారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు.

చర్చ అది కాదు..

'ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా.. కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త చెబుతున్నాం. వారికి జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయి. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు' అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

తొలగించడం లేదు..

'పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దు. సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందుర్తీలో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నాం. ఇందుర్తి మండలం కోసం ప్రతిపాదనలు పంపాం. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుంది' అని పొన్నం ప్రభాకర్ వివరించారు.

సిద్ధిపేటలో..

అటు సిద్ధిపేటలో కందుల కొనుగోలు కేంద్రాన్ని పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 'సిద్దిపేట మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. కందుల మద్దతు ధర రూ.7550తో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు కందులను మద్దతు ధరకు అమ్ముకోవాలి. గతంలో వడ్లు, పత్తి, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా ఏర్పాటు చేశాం. వడ్ల కొనుగోలు చేసిన 48 గంటలలో పేమెంట్ చేశాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం' అని మంత్రి వివరించారు.

రైతుల కోసం..

'జనవరి 26 నుండి వ్యవసాయ యోగ్యమైన భూములు రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా 12 వేలకు పెంచాం. భూమిలేని ఉపాధి కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుంది. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నాం. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పర్యటించి అయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారు' అని పొన్నం వ్యాఖ్యానించారు.

Whats_app_banner