Teachers Transfers : బదిలీల విషయంలో టీచర్లకు ఊరట కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 317 జీవో పై పోరాడుతోన్న ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పిస్తూ ... బదిలీ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ట్రాన్స్ ఫర్స్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో... మంగళవారం విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు, నిబంధనల్లో చేయాల్సిన మార్పులపై చర్చించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని... జీవో 317తో బదిలీ అయిన టీచర్ల పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణించాలని నిర్ణయించారు. ఇలా... బదిలీ అయిన టీచర్లు, ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులని ఆదేశించారు.,రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకునేందుకు పలు నిబంధనలు విధించింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో.. 317 జీవో తో ఇతర జిల్లాలకు ట్రాన్స్ ఫర్ అయిన టీచర్లు ఆందోళన బాట పట్టారు. తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి కేవలం ఒక సంవత్సరమే అవుతోందని... దీంతో ప్రస్తుత బదిలీలకు తమకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల్లో మార్పు చేసి తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కొంత మంది టీచర్లు ఈ అంశంలో హైకోర్టుని ఆశ్రయించారు. ,విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25 వేల మంది ఉన్నందున.. ప్రభుత్వం వారి విజ్ఞప్తులను పరిశీలించాలని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలోని సర్వీసు కాలాన్ని కూడా కలిపి.. వాటి ఆధారంగా బదిలీలు చేపట్టాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో... బదిలీల ప్రక్రియ నిలిపివేయాలా లేక నిబంధనల్లో మార్పులు చేయాలా అనే అంశంపై సర్కార్ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపింది. చివరికి... నిబంధనల్లో మార్పునకే మొగ్గు చూపి... ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 317 జీవోతో బదిలీ అయిన టీచర్ల పూర్వ జిల్లా సర్వీసుని కూడా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.,తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గత నెల 28న మొదలైంది. దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి అవకాశం కల్పించిన నేపథ్యంలో... జాబితాను మళ్లీ మార్చాల్సి ఉంటుంది. కొత్తగా మరో 25 వేల మంది బదిలీలకు దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.