TG Contract Employees: రిటైర్ అయ్యాక కొలువులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్, వేలాది ఉద్యోగుల ఉద్వాసన
TG Contract Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిటైర్ అయినా కాంట్రాక్టు కొలువుల్లో కొనసాగుతున్న వేలాది మందిపై ప్రభుత్వం వేటు వేసింది.ఇలా ఐఏఎస్ అధికారుల నుంచి అటెండర్ల వరకు అన్ని స్థాయిల ఉద్యోగులు ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగాలు చేస్తూ పదోన్నతులకు అడ్డుగా నిలిచారనే ఆరోపణలున్నాయి
TG Contract Employees: ప్రభుత్వ సర్వీస్‌లో రిటైర్మెంట్ తర్వాత కూడా కుర్చీలు వదలకుండా పెన్షన్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాల్లో జీతాలు తీసుకుంటున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జుళిపించింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలని ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీరంతా ఇంటి బాట పట్టనున్నారు. ఒక్క మునిసిపల్ శాఖలోనే 177మంది ఉద్యోగులపై వేటు వేశారు. కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకోవాలంటే నోటిఫికేషన్లు ఇచ్చి నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల్లో పాతుకుపోయిన వారంతా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, హెచ్‌ఎండిఏ కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు పది మంది ఉన్నారు. వీరందరిని తొలగించాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల్లో తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే.. వారిని మళ్లీ నియమించు కోవడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేశారు.
మునిసిపల్ శాఖలోనే 177మందిపై వేటు..
సర్కారు నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమం కానుంది. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు అందగానే మునిసిపల్ శాఖ చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సుదీర్ఘ కాలంగా ఉద్యోగాలుచేస్తున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ వాటర్‌వర్క్స్, మెట్రోరైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు, డీఎఫ్‌ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి, సహాయక ఇంజనీర్లు, అటెండర్ల వరకు పలు క్యాడర్లకు చెందిన అధికారులు,ఉద్యోగులు ఉన్నారు.
6729మందిపై వేటు..
తెలంగాణలో ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైర్ అయిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న 6729మందికి ఉద్వాసన పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. మునిసిపల్ శాఖలో ఉద్యోగుల్ని తొలగించడంతో విద్యుత్తు శాఖలో మరికొందరు డైరెక్టర్లను తొలగించనున్నారు.
ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.రెవెన్యూ, దేవాదాయం, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు సహా అన్ని శాఖలు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
కొందరికే మళ్లీ అవకాశం…
విశ్రాంత ఉద్యోగులను అవసరం మేరకు కొత్త నోటిఫికేషన్ మేరకు నియమించాలని స్పష్టం చేయడంతో 6,729 మందిలో అయా విభాగాల్లో నిపుణులైన 100మందికి కాంట్రాక్ట్ కొలువులు దక్కే అవకాశాలు ఉన్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఎన్‌వీఎస్ రెడ్డితో పాటు సాంకేతిక అంశాల్లో అనుభవం ఉన్న ఇంజనీర్లను కొనసాగించే వీలుంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో 6,729 ఖాళీలు రానుండటంతో కొత్త వారిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఖాళీల నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా దక్కొచ్చని చెబుతున్నారు.
సంబంధిత కథనం