TG Sand Supply : ఇసుక కొరతను తీర్చేందుకు 24 గంటలు ఆన్‌లైన్‌ బుకింగ్‌.. 10 ముఖ్యమైన అంశాలు-telangana government provides 24 hour booking facility for sand 10 key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Sand Supply : ఇసుక కొరతను తీర్చేందుకు 24 గంటలు ఆన్‌లైన్‌ బుకింగ్‌.. 10 ముఖ్యమైన అంశాలు

TG Sand Supply : ఇసుక కొరతను తీర్చేందుకు 24 గంటలు ఆన్‌లైన్‌ బుకింగ్‌.. 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Published Feb 17, 2025 01:01 PM IST

TG Sand Supply : రాష్ట్రంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇసుక రీచ్
ఇసుక రీచ్

తెలంగాణలో ఇసుక కొరతను తీర్చేందుకు రేవంత్ సర్కారు చర్యలు చేపట్టింది. 24 గంటలు ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదే సమయంలో.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..

1.రాష్ట్రంలో ప్రస్తుతం చాలాచోట్ల టీజీఎండీసీ ఇసుక రీచ్‌లను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆయా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అవుతోంది.

2.గతంలో ప్రభుత్వ రీచ్‌లు, డంపింగ్‌ యార్డుల్లోని ఇసుక నిల్వల వివరాలను రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచేవారు. 12 తర్వాతే ఇసుక బుకింగ్‌కు అవకాశమిచ్చేవారు.

3.ఈ విధానాన్ని మార్చుతూ.. 24 గంటల ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఒక లారీ నంబర్‌పై ఒకసారి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుంటే.. ఆ వాహనం అన్‌లోడ్‌ అయ్యాకే మళ్లీ డీడీ చెల్లించే సదుపాయం ఉండేది.

4.ప్రస్తుతం ఒక లారీ నంబర్‌పై మూడు డీడీలు చెల్లించే అవకాశమిస్తున్నారు. కానీ.. 15 రోజుల్లోపే ఇసుక తీసుకెళ్లాలనే నిబంధన విధించారు.

5.గోదావరి నది తీరం వెంట ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. గోదావరి నదితో పాటు కిన్నెరసాని, ముర్రేడు వంటి నదుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలుతోంది.

6.స్థానికంగా ట్రాక్టర్‌ యజమానులు మాఫియాగా ఏర్పడుతున్నారు. నదులు, వాగుల నుంచి ఇసుకను డంప్‌లకు చేరవేస్తున్నారు. అక్కడ్నుంచి టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

7.అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు సైలెంట్‌గా ఉండటంపై ఆరోపణలు వపిస్తున్నాయి. భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇదే అదునుగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

8.అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 24 గంటలు ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

9.రీచ్‌ల్లో అక్రమ ఇసుక దందాకు అవకాశం లేకుండా.. పోలీస్, రెవెన్యూ, టీజీఎండీసీ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ టీమ్‌లు నిరంతరం రీచ్‌లను పర్యవేక్షిస్తాయి.

10..ప్రభుత్వ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో.. ఇసుక తగినంత అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని అంటున్నారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner