తెలంగాణ రాజీవ్ యువ వికాసం స్కీమ్ మంజూరు పత్రాల అందజేత ప్రక్రియ వాయిదా పడింది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం… నేటి నుంచి జూన్ 9వ తేదీ వరకు లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయాల్సి ఉంది. రూ. లక్షలోపు యూనిట్లకు ముందుగా ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో శాంక్షన్ లెటర్ల అందజేత ప్రక్రియపై సర్కార్ వెనక్కి తగ్గింది.
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు భారీ దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి కలిపి 16.22 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. అనూహ్యమైన రీతిలో దరఖాస్తులు రావటంతో… దరఖాస్తుల పరిశీలన విషయంలో ప్రభుత్వం పలు జాగ్రత్తలను చేపట్టింది. అన్ని కోణాల్లో దరఖాస్తుదారుడి వివరాలను సేకరించే ప్రయత్నం చేసింది. విడతలవారీగా శాంక్షన్ లెటర్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా రూ. లక్ష లోపు యూనిట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది.
భారీగా దరఖాస్తులు రావటంతో పరిశీలన ప్రక్రియ కాస్త ఇబ్బందిగానే కొనసాగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక పక్కాగా ఉండాలని… అనర్హులకు దక్కవద్దనే అభిప్రాయాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వంలోని మంత్రులు…. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఒక్క అనర్హుడికి కూడా స్కీమ్ అందవద్దని స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించి… నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇవాళ చేపట్టాల్సిన మంజూరు పత్రాల జారీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడాల్సి వచ్చింది.
జూన్ 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఇందులో యువ వికాసం స్కీమ్ తో పాటు మరికొన్ని స్కీమ్ లపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు చివరి నిమిషంలో శాంక్షన్ లెటర్ల ప్రక్రియ వాయిదా పడటంతో… పలువురు దరఖాస్తుదారులు నిరాశకు లోనయ్యారు.
ఈ స్కీమ్ కింద ఈ ఏడాదికి 5 లక్షల మంది అర్హులను(లబ్ధిదారులను) ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం రూ.6,250 కోట్ల నిధులను కేటాయించింది. కేబినెట్ భేటీ తర్వాత… లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకుసాగటంతో పాటు శాంక్షన్ లెటర్లను అందజేసే అవకాశం ఉంది.