వరంగల్.. ఈ పేరు వింటే మొదట గుర్తొచ్చేది భద్రకాళి అమ్మవారి ఆలయం. ప్రస్తుతం ఈ దేవాలయం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.54 కోట్లతో ఇటీవల పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ సూచనలతో తమిళనాడులోని మదురైలోని మీనాక్షి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పనులను పర్యవేక్షిస్తున్నారు.
1.భద్రకాళీ ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రత్యేక రోజుల్లో భద్రకాళి అమ్మవారి ఊరేగింపులు, వాహన సేవలకు ఉపయోగపడేలా 30 అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్‌లను ఖరారు చేశారు.
2.ప్రస్తుతం దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి ఖాళీ స్థలాలను చదును చేసే పనులు సాగుతున్నాయి. ఆలయం నాలుగువైపులా రాజగోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.24 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
3.మదురైతోపాటు తంజావూరుకు చెందిన స్తపతులతో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
4.భద్రకాళి అమ్మవారి విగ్రహం 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవుతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో 5 వేల మంది భక్తులు వస్తుండగా ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో 15 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు.
5.భద్రకాళీ ఆలయం చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. క్రీస్తుశకం.1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం 625 ఏళ్లు ప్రాభవం కోల్పోయిన ఆలయానికి.. పునర్వైభవం కల్పించేలా 1948లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బీఎస్ గణేశ్‌శాస్త్రీ దాతల సహకారంతో పునరుద్ధరణ చేశారు.
6.ఆ తర్వాత 1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకనుగుణంగా.. ఆలయ శిఖరం, మహామండపం, సాలహారాలను నిర్మించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత.. ఇప్పుడు ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
7.వేంగీ చాళుక్యులపై విజయం సాధించినందుకు గుర్తుగా.. పశ్చిమ చాళుక్య ప్రభువు రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించాడని చెబుతారు. ఏకశిలపై అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉండటం దీనికి నిదర్శనం.
8.కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సమయంలో అమ్మవారిని విశేషంగా పూజించారు. ప్రతాపరుద్రుని కాలంలో ఈ ఆలయం బాగా ప్రాచుర్యం పొందిందని చరిత్ర చెబుతోంది.
9.కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం.. ఈ ఆలయం కొంతకాలం ప్రాభవం కోల్పోయింది. 1950 తర్వాత భక్తులు, వ్యాపారులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
10.ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా కూడా పిలుస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు రంగులో మెరిసిపోతుంది.
సంబంధిత కథనం