TGPSC Group 1 : గ్రూప్ 1 పరీక్షలపై ఉత్కంఠ - సర్కార్ నుంచి నేడు కీలక ప్రకటన..! అభ్యర్థులకు ఊరట దక్కేనా..?
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం కాగా.. పలువురు అభ్యర్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అభ్యర్థుల ఆందోళన ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం... రేపట్నుంచే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి... పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం సచివాలయం ముట్టడికి కూడా చేపట్టారు. అశోక్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.
జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. జీవో 29పై అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. జీవో 55 ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రస్తావిస్తున్నారు. జీవో 29తో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతోందని... ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.
నేడు కీలక ప్రకటన...!
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్హులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా చర్యలు, ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు.
ఇవాళ కూడా మంత్రుల బృందం గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై చర్చలు జరపనుంది. అభ్యర్థులతో కూడా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ ప్రభుత్వం సమగ్రమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం చేసే ప్రకటనతో అభ్యర్థులు వెనక్కి తగ్గుతారా..? లేదా..?అన్నది చర్చనీయాంశంగా మారింది.
సుప్రీంలో రేపు విచారణ..
గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై రేపు(సోమవారం) విచారణ జరిగనుంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైకోర్టులో అభ్యర్థులకు ఊరట దక్కలేదు. పరీక్షలు ప్రారంభం రోజే కోర్టు విచారణ ఉండటంతో... గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది..!
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ :
- జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.
- పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.
- పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.
- పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.
- పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.
- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.
అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి తోడు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్ లో భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహిస్తారు.
సంబంధిత కథనం