TG Professors : ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు.. కారణాలు ఇవే!
TG Professors : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును పెంచింది. ఈ మేరకు జీవో జారీ చేసింది రేవంత్ ప్రభుత్వం. దీనిపై ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపైనా చర్చ జరుగుతోంది.
యూనివర్సిటీల ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచుతూ.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచాలని ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. దాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కారణాలు ఏంటీ..
తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 2 వేల 817 ప్రొఫెసర్లు పనిచేయాలి. కానీ.. ప్రస్తుతం 757 ఆచార్యులే పని చేస్తున్నారు. దాదాపు 73 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పైగా కాకతీయ, ఉస్మానియా వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో పదవీ విరమణ పొందేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కనీసం ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.
సరిపడా లేక..
తెలంగాణలోనే పెద్ద యూనివర్సిటీ ఉస్మానియా ఎడ్యుకేషన్ విభాగంలో.. కేవలం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. వారే అన్ని విశ్వవిద్యాలయాలకు డీన్లుగా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కన్వీనర్లను నియమించాలన్నా.. సరిపడా ప్రొఫెసర్లు లేరు. పీఈసెట్, ఎడ్‌సెట్‌ల నిర్వహణ బాధ్యతలను మహాత్మా, శాతవాహన యూనివర్సిటీలకు అప్పగించారు. కానీ.. కన్వీనర్లుగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లే వ్యవహరిస్తున్నారు.
శ్రీధర్ బాబు ఇలా..
అయితే.. ఆచార్యుల పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి కొన్ని గంటల ముందే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ఆలోచన లేదని.. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 65 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పదవీ విరమణ వయ్సస్సును పెంచారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. 2021కి ముందు 58 ఏళ్లు ఉండగా.. దాన్ని 61 ఏళ్లకు పెంచారు. దీంతో యువత, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ యువత పట్ల జాగ్రత్తగానే ఉంది. కానీ.. ప్రస్తుతం పదవీ విరమణ చేసే వారికి దక్కే ప్రయోజనాలను చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. నిధులు సరిపడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా పెంచే యోచనలో ఉన్నట్టు సమచారం.