TS TET 2024 : మెగా డీఎస్సీ కంటే ముందే 'టెట్' నోటిఫికేషన్...! తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
TS TET Exam 2024 Updates: ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. టెట్ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
TS TET Exam 2024 Updates: తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification 2024) విడుదలైన సంగతి తెలిసిందే. 11వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ప్రకటన ఇచ్చింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే కీలకమైన మెగా డీఎస్సీ వచ్చిన నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్(TS TET Exam 2024) ఇవ్వాలని కోరుతున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్…. కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ టెట్ పరీక్ష(Telangana TET 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. డీఎస్సీ కంటే ముందే ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో… ఏ క్షణమైనా విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టెట్ నిర్వహించటం ద్వారా… చాలా మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం దక్కే ఛాన్స్ ఉంది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో…టెట్ ( TS TET )పరీక్ష నిర్వహణ కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వచ్చారు. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీని నిర్వహించాలని కోరుతున్నారు. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులే కాకుండా… ప్రస్తుతం డీఈడీ, బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ నిర్వహించాలని గట్టిగా కోరుతున్నారు. తమకు అవకాశం ఇస్తే… మెగా డీఎస్సీ(Telangana DSC 2024) కూడా రాసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావటానికి చాలా సమయం పడుతుందని… ఫలితంగా తమకు ఇప్పుడే టెట్ రాసే ఛాన్స్ ఇస్తే… ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతామని అంటున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వంలోని మంత్రులతో పాటు అధికారులకు కూడా వినతిపత్రాలను ఇచ్చారు.
టెట్ పరీక్షలను నిర్వహించాలనే డిమాండ్ తో ఇటీవలే అభ్యర్థులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టెట్ నోటిఫికేషన్(TS TET Notification 2024) కోసం అభ్యర్థుల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున రావటంతో ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగనే… టెట్ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రానుంది.
డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ…
Telangana Mega DSC 2024: మరోవైపు మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.