Telangana Govt : ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్ - ప్రత్యేక కమిటీ ఏర్పాటు-telangana government has appointed a three member committee on employees issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt : ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్ - ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Telangana Govt : ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్ - ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Committee On employees issues Issues: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల సమస్యలను అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం (CMO Telangana)

TS Govt Committee On Employees Issues: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను(Employees Issues) పరిష్కరించే దిశగా అడుగు ముందుకు వేసింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy)… ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి(Chinnareddy) నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం నిర్ణయించారు. ఇందులో ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి - సీఎం రేవంత్

పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలను ఆదేశించారు.

ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అధికారులను ఆదేశించారు. అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలని  దిశానిర్దేశం చేశారు.

సౌది ఆరేబియాలో చనిపోయిన ఇద్దరు వలస కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబు, వేములవాడ మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన శశికుమార్‌ గత డిసెంబర్‌లో సౌదీలో చనిపోయారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున సహాయం విడుదల చేస్తూ శుక్రవారం సర్కార్ ఆదేశాలు జారీ చేశారు.