రేవంత్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ.. జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క చొరవతో.. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం అందనుంది. పెళ్లి చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే.. గతంలో లక్ష రూపాయలు వివాహ ప్రోత్సాహం అందేది. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే.. వివాహ ప్రోత్సాహ పథకం వర్తించ లేదు.
ఈ సమస్యను గుర్తించి.. మహిళా శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. దివ్యాంగుల సమస్యకు పరిష్కారం చూపుతూ.. జీవో జారీ అయ్యేలా చేశారు. ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా.. ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష రూపాయల ఆర్థిక సహాయం వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.
వధూవరులు ఇద్దరూ దివ్యాంగులై ఉండాలి. వారికి ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధృవీకరణ పత్రం ఉండాలి. వధువుకు కనీసం 18 సంవత్సరాలు, వరుడికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివ్యాంగులకు మాత్రమే వర్తిస్తుంది. దివ్యాంగులు వివాహం చేసుకోవడానికి ప్రోత్సాహం అందించడం ద్వారా.. వారి జీవితాల్లో వెలుగు నింపడం, వారిని సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా జీవించేలా చూడటం ఈ పథకం ముఖ్య లక్ష్యం.
ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా అయితే.. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కావలసిన పత్రాలు, దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం ఆ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.
తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులు లేని హైదరాబాద్‌లోని అనాథ పిల్లలకు.. ఇక నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. హైదరాబాద్ జిల్లాలోని 2,200 మంది అనాథ చిన్నారులకు అధికారులు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అనాథ బాలలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
సంబంధిత కథనం