TG Govt Holidays : ఈ నెలలో ఆ 2 రోజులు సెలవు..! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం-telangana government declaring holidays on 7 and 17th of this month 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Holidays : ఈ నెలలో ఆ 2 రోజులు సెలవు..! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

TG Govt Holidays : ఈ నెలలో ఆ 2 రోజులు సెలవు..! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 04, 2024 07:55 PM IST

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో జరిగే మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 7 వినాయక చవితి, 17న మిలాద్ ఉన్ నబీకి హాలీ డే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ సెలవులు
తెలంగాణ ప్రభుత్వ సెలవులు

ఈ నెల 7, 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 7వ తేదీన వినాయక చవితి ఉండగా…. 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ ఉంది. ప్రభుత్వం ప్రకటించే సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ సెలవు ఉంది. కానీ ఈ తేదీని మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో సెప్టెంబర్ 17వ తేదీకి హాలీ డే మారింది.

మిలాద్ ఉన్ నబీ హాలీ డే విషయంలో నెలవంక దర్శనం కీలకంగా ఉంటుంది. గతేడాది కూడా ఓ తేదీని నిర్ణయించినప్పటికీ… మరో తేదీలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 7వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే 17వ తేదీనే నిమజ్జనం జరగనుంది. ఇదే రోజు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కూడా జరగాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మిలాద్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సచివాలయంలో నిర్వహించిన స‌మీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ర్యాలీ తేదీ మార్పు…!

ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగా… మిలాద్-ఉన్-న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19 వ తేదీన నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. సెప్టెంబ‌రు 7 నుంచి గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు, 17న నిమ‌జ్జ‌నం ఉన్న విష‌యం చ‌ర్చ‌కు వచ్చింది. ఈ సందర్భంలోనే మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల అనంతరం… ఇదే అంశంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ, మిలాద్ క‌మిటీ స‌భ్యులు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై చర్చించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మిలాద్-ఉన్-న‌బీ ర్యాలీ వేడుకలను 19వ తేదీన నిర్ణయించేందుకు అంగీకరించింది. ఇందుకు అనుగుణంగానే మిలాద్ కమిటీ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది. ఫలితంగా వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వేడుకలు వేర్వురు తేదీల్లో జరగనున్నాయి.