TS CETs 2023 : తెలంగాణలో 2023 -24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. కామన్ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... సెట్ ల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు.... ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీజీ ఈసెట్ తేదీలను ఖరారు చేశారు. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నింటినీ ఆన్ లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. దాదాపు అన్నీ పరీక్షలూ మే నెలలోనే జరగనున్నాయి.,మే 7 నుంచి 14వ తేదీ వరకు టీఎస్ ఎంసెట్ నిర్వహించున్నారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్... 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ జరుగుతుంది.,బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మే 18న గురువారం జరుగుతుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.,ఇంజినీరింగ్ లో లేటరల్ ఎంట్రీ కోసం ఉద్దేశించిన టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 20న శనివారం నిర్వహించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది.,3 ఏళ్ల న్యాయవిద్య, 5 ఏళ్ల లా కోర్సులో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్.. మే 25న గురువారం జరగనుంది. అదే రోజు... ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టు అయినటువంటి టీఎస్ పీజీఎల్ సెట్ కూడా జరుగుతుంది. ఈ సెట్ లను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది.,ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష.. మే 26 (శుక్రవారం), మే 27(శనివారం) తేదీల్లో జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరుగుతుంది.,ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష... మే 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతుంది. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరుగుతాయి.,దరఖాస్తు తేదీలు, రిజిస్ట్రేషన్ వివరాలు, అప్లికేషన్ ఫీజు, అర్హతలు తదితర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లను ఆయా సెట్ల కన్వీనర్లు త్వరలోనే విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నారు.