బీసీ రిజర్వేషన్లపై జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వటంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అయింది. ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఇచ్చిన స్టే సవాల్ చేస్తూ…. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది.
జీవో 9, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.
హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అందుబాటులోకి రాగా… ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్టడీ చేసినట్లు తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని… సీనియర్ కౌన్సిల్‌తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని యోచిస్తోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం.
ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. జనగణనతో పాటు ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలను కూడా ప్రస్తావించనుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది.
మరోవైపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం ఉండటంతో… పలువురు సుప్రీంకోర్టులో కేవియట్ కూడా దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదనలు కూడా వినాలని కోరారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని కెవియట్ పిటిషన్ లో పేర్కొన్నారు.
మరోవైపు హైకోర్టు తీర్పు కాపీలోని వివరాల ప్రకారం…. 50 శాతం రిజర్వేషన్ల దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందుకు వెళ్లవచ్చని… అయితే రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికి మించరాదని స్టే తీర్పు కాపీలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే…. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించే జీవోకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడినట్లు అవుతుంది.
సంబంధిత కథనం