ఇజ్రాయెల్, ఇరాన్‌ల నుండి తిరిగి వస్తున్న తెలంగాణ వాసులకు ప్రభుత్వ అండ-telangana government continues to extend necessary support to citizens returning from conflict hit israel and iran ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇజ్రాయెల్, ఇరాన్‌ల నుండి తిరిగి వస్తున్న తెలంగాణ వాసులకు ప్రభుత్వ అండ

ఇజ్రాయెల్, ఇరాన్‌ల నుండి తిరిగి వస్తున్న తెలంగాణ వాసులకు ప్రభుత్వ అండ

HT Telugu Desk HT Telugu

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ ప్రభావిత ప్రాంతాల నుండి తిరిగి వస్తున్న తెలంగాణ వాసులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోంది

టెల్ అవీవ్, జూన్ 23, 2025: ఇరాన్ నుండి క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైరన్‌లు మోగడంతో, ప్రజలు టెల్ అవీవ్‌లోని భూగర్భ షెల్టర్‌లలో ఆశ్రయం పొందారు (AFP)

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రభుత్వం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రభావిత ప్రాంతాల నుండి తిరిగి వస్తున్న తెలంగాణ వాసులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సమన్వయ ప్రయత్నంలో భాగంగా, నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు తెలంగాణ విద్యార్థులకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. వీరిలో నలుగురు ఇరాన్ నుండి, ఇద్దరు ఇజ్రాయెల్ నుండి వచ్చారు.

ఆ ఆరుగురు విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లడానికి ముందే విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తెలంగాణ భవన్ సిబ్బంది ఉదయం 5:30 గంటలకు వారిని సురక్షితంగా సాగనంపారు. ఢిల్లీలో ఉన్నంతసేపు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న అధికారులు, వారు విమానాలు ఎక్కే వరకు సహాయం అందించారు.

అంతేకాకుండా, మరో ఏడుగురు తెలంగాణ వాసులు ఈరోజు రాత్రి న్యూఢిల్లీకి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. వీరు ఇజ్రాయెల్ నుండి జోర్డాన్‌లోని అమ్మాన్‌కు విజయవంతంగా చేరుకున్నారు. త్వరలోనే భారతదేశానికి చేరుకోవాల్సి ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో, తెలంగాణ భవన్‌లో వారికి స్వాగతం పలకడానికి, సహాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా ఇజ్రాయెల్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన అనేకమంది తెలంగాణ నివాసితులు ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రభావిత పౌరులందరికీ సహాయం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.

ఆ ప్రాంతం నుండి తిరిగి వస్తున్న ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణానికి మద్దతు అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రజలు అధికారిక మార్గాలతో సంప్రదింపులు జరపాలని, ధృవీకరించని సమాచారంపై ఆధారపడకుండా ఉండాలని సూచించారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వారి భద్రతను, వేగంగా తిరిగి రావడాన్ని నిర్ధారించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.