TG Grama Sabhalu : గ్రామ సభలు ముగిశాయి.. ఆశలు అలాగే మిగిలాయి.. ప్రభుత్వం ఏం సాధించింది?
TG Grama Sabhalu : జనవరి 26 నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలు ప్రారంభించాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. ఈ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించింది. ఈ సభల్లో చాలాచోట్ల ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. తమపేర్లు అర్హుల జాబితాలో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను.. జనవరి 26న ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలను విడుదల చేసింది. లబ్ధిదారుల ధ్రువీకరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం నిర్వహించిన గ్రామసభలు శుక్రవారం ముగిశాయి.

16,348 సభలు..
ఈ నెల 21 నుంచి మొదలైన గ్రామ సభలు నాలుగు రోజుల పాటు భారీఎత్తున జరిగాయి. అన్నిచోట్లా దరఖాస్తుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తాము లబ్ధిదారులుగా ఎంపిక కాకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అనర్హుల పేర్లు జాబితాలో చేర్చడంపై కొన్నిచోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నాలుగు రోజుల్లో మొత్తం 12 వేల 861 గ్రామ సభలు, 3 వేల 487 వార్డు సభల చొప్పున.. మొత్తం 16 వేల 348 సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డులు..
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాబితాలను అధికారులు వెల్లడించారు. దీంతో జాబితాలో తమపేర్లు రానివారు అధికారులపై తిరగబడ్డారు. తమ పేర్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఈ రెండు పథకాల కోసమే గ్రామ సభలకు వచ్చారు. అయితే.. పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయినా.. ప్రజల ఆగ్రహం తగ్గలేదు. మళ్లీ దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు.
విమర్శల వెల్లువ..
ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుకుంటోందని చాలాచోట్ల విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితులను ప్రతిపక్ష బీఆర్ఎస్ వాడుకుంది. ప్రజల తరఫున చాలాచోట్ల బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. ఎంతమంది దరఖాస్తు చేస్తున్నారు.. ఎంతమంది పేర్లు వచ్చాయి.. మళ్లీ దరఖాస్తులు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఎమ్మెల్యేల ముందే పరస్పరం దాడులు చేసుకున్నారు.
క్లారిటీ లేదు..
ముఖ్యంగా.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితాపై క్లారిటీ లేదు. ప్రస్తుతం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ.. గ్రామసభల్లో వెల్లడించిన జాబితాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 50 వేలకు పైగానే పేర్లు ఉన్నాయి. వారందరికీ ఇళ్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చిన జాబితాలో ఎవరికి ఇళ్లు ఇస్తారని నిలదీశారు. ఇదంతా మోసం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకి గ్రామసభలు నిర్వహించినా.. మొత్తం కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇళ్లు ఇవ్వబోతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
రేషన్ కార్డుల కోసం..
ఇక రేషన్ కార్డుల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న చాలామంది పేర్లు జాబితాలో లేవు. గతంలో మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా మీసేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకునేవాళ్లం కదా అని అధికారులను నిలదీశారు. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పగా.. మళ్లీ ఎందుకని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఇదే ఫైనల్ కాదు..
గ్రామ సభల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని స్పష్టం చేశారు. జాబితాలో ఉంటే ఉన్నట్లు.. లేకపోతే రానట్లు కాదని చెప్పారు. అర్హత ఉండి పేరు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటి ఆధారంగానే ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుందని విమర్శించారు.