Layout Regularization Scheme : ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ
Layout Regularization Scheme : లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. 10 శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

Layout Regularization Scheme : లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీ ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ లు కొన్న పేదలకు మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించారు.
ఫీజులో రాయితీ
10 శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించనున్నారు. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దే చెల్లింపులు చేసి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రభుత్వానికి 25.67 లక్షల దరఖాస్తులు అందాయని మంత్రులు తెలిపారు. ఇందులో ప్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు కాగా, లేఅవుట్ల దరఖాస్తులు 0.13 లక్షలు ఉన్నాయని మంత్రులు తెలిపారు.
అనధికార లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు, వాటిని క్రమబద్దీకరించుకునేందుకు రూ.1000 ఛార్జీగా చెల్లించాలని 2020లో అప్పటి ప్రభుత్వం చెప్పడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వాటిని క్రమబద్దీకరించలేదు. గతేడాది ఆగస్టు మొదటివారంలో అప్లికేషన్ల పరిశీలన ప్రారంభించినట్లు ప్రకటించారు. తాజాగా వీటిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
పొలాలను వెంచర్లుగా మార్చి
రాష్ట్రంలో కొత్త జిల్లాలు....జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో... మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో వెంచర్లు వెలిశాయి. వ్యవసాయ భూములను కొన్న రియల్టర్లువాటిని వెంచర్లుగా మార్చి ప్లాట్లు చేసి అమ్మారు. చాలా మంది ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే వీటికి ఎల్ఆర్ఎస్తో లింక్ పెట్టడంతో వాటిని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎల్ఆర్ఎస్ కోసం గత ప్రభుత్వంలో 47,864 మంది రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు.
వీటిపై ప్రభుత్వానికి రూ.4.78 కోట్ల ఆదాయం సమకూరింది. అనధికార వెంచర్లలో రెండో రిజిస్ట్రేషన్ కు అవకాశం ఇవ్వడంతో కొందరు అక్రమంగా క్రయవిక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో తాజాగా ఎల్ఆర్ఎస్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
సంబంధిత కథనం