తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖను అందజేశారు.
బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. బనకచర్లపై అభ్యంతరాలతో పాటు నీటి వాటాలకు సంబంధించి అనేక అంశాలను కేంద్రమంత్రికి వివరించారు.
“తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుంది. ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు” అని సీఎం రేవంత్ తెలిపారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ… తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదు. ఏపీ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య పలు అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. పాలమూరు - రంగారెడ్డి, సమ్మక్క- సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలి. గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలి” అని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. బనకచర్లకు సంబంధించిన డీపీఆర్ తమకు అందలేదని కేంద్ర మంత్రి చెప్పారని వివరించారు. త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మంత్రి వివరించారు.