TG SSC Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు - విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. వార్షిక పరీక్షల వేళ ప్రస్తుతం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందజేయనుంది. ఈ మేరకు తాజాగా వివరాలను పేర్కొంది.
పరీక్షల వేళ పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం(స్నాక్స్) ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించింది.

రాష్ట్రంలో మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈసారి పాస్ శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. అయితే చాలా గ్రామాల్లోని విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా…. ప్రభుత్వం స్నాక్స్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతంలో కూడా ఈ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 1 నుంచి అమలు...
ఫిబ్రవరి 1 నుంచి స్నాక్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. మార్చి 20వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. మొత్తం 38 రోజులపాటు అల్పాహారం ఇచ్చేలా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు-బెల్లంతో పాటు మరికొన్ని ఇచ్చేలా చూడనున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల మహిళలే వీటిని కూడా సరఫరా చేయనున్నారు.
మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు - షెడ్యూల్ :
మరోవైపు విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
- 21-03-2025 ఫస్ట్ లాంగ్వేజ్
- 22-03-2025 సెకండ్ లాంగ్వేజ్
- 24-03-2025 థర్డ్ లాంగ్వేజ్
- 26-03-2025 మ్యాథమేటిక్స్
- 28-03-2025 ఫిజికల్ సైన్స్
- 29-03-2025 బయోలాజికల్ సైన్స్
- 02-04-2025 సోషల్ స్టడీస్.
టెన్త్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులతో పాటు నవంబరు నుంచే ఉదయం పూట ఒక గంటపాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే వార్షిక పరీక్షల సమయం దగ్గరపడిన నేపథ్యంలో… సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. వారం చివరన స్లిప్ టెస్టులు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
పది ఫలితాలపై పూర్తిగా ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలని ఇటీవల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫలితాల మెరుగుదలకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో తరచూ సమావేశాలు నిర్వహించి జిల్లా అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.
సంబంధిత కథనం