TG Local Body Elections 2025 : 'స్థానిక' సమరానికి సన్నద్ధం..! ముఖ్యమైన 10 అంశాలు-telangana gears up for local body elections konw these 10 key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Local Body Elections 2025 : 'స్థానిక' సమరానికి సన్నద్ధం..! ముఖ్యమైన 10 అంశాలు

TG Local Body Elections 2025 : 'స్థానిక' సమరానికి సన్నద్ధం..! ముఖ్యమైన 10 అంశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 08, 2025 09:32 AM IST

Telangana Local Body Elections 2025 : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా అధికాయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూల్ విడుదల కానుంది. అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని తాజా ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది.

తెలంగాణలో స్థానిక ఎన్నికలు
తెలంగాణలో స్థానిక ఎన్నికలు (image source @Collector_RSL)

స్థానిక ఎన్నికల సమరానికి తెలంగాణ సిద్ధం కాబోతుంది..! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే షెడ్యూల్ వెల్లడయ్యే సూచనలు ఉన్నాయి.

స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది శిక్షణ, ఎన్నికల నిర్వహణ విషయంలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ… ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా…. పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేసే పనిలో ఉన్నారు. హస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదిపేస్తున్నారు. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోని స్థానిక పోరులో సత్తా చాటాలని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ చూస్తున్నాయి.

రాబోయే స్థానిక ఎన్నికల్లో  సత్తా చాటాలని ఆశావాహులు పావులు కదిపేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాగానే… మరింత దూసుకెళ్లాలని భావిస్తున్నారు. చాలా రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసీ నుంచి ప్రకటన వెలువడితే… పల్లెల్లో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది. 

స్థానిక ఎన్నికలు - ముఖ్యమైన అంశాలు:

  • రాష్రంలోని గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ లో పదవీ కాలం గతేడాది జనవరి 31వతో ముగిసింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.
  • 2024 జూన్ మాసంలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
  • పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ… ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఆలస్యమైంది.
  • ఈ ఫిబ్రవరి నెలలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా..? లేక పంచాయతీ ఎన్నికలు ఉంటాయా..? అనే దానిపై ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.
  • బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందనుంది. దీనిపై చర్చించి… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది.
  • రిజర్వేషన్ల కోటా ఖరారైన తర్వాత పాటు ఎన్నికల తేదీలపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వెంటనే ఎన్నికల ప్రకటన ఉంటుంది.
  • పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించి పూర్తి చేయాలని సూచించింది.
  • ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాలను ఈసీ గుర్తించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఆ దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముసాయిదాలను కూడా దిశానిర్దేశం చేసింది.
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల గుర్తులపై ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.
  • ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Whats_app_banner