తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తూ, ప్రజా ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'రైతు నేస్తం' వేదికగా ఆన్‌లైన్‌లో మీట నొక్కి, రైతు భరోసా నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రైతుల ఆశీర్వాదం ఎంత కీలకమో ఉద్ఘాటించారు. "రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం" అని ఆయన అన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గతంలో పదవులు అనుభవించినవాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు. పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు" అని తీవ్రంగా విమర్శించారు.
"ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం" అంటూ గత పాలకుల విధానాలపై మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. "వరి వేయండి, చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం" అని ఆయన ప్రకటించారు. పేదలకు సన్న బియ్యం అందించేందుకు, రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించామని తెలిపారు. "సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం. మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించగలుగుతున్నాం" అని వివరించారు.
వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. "రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి" అని ఆయన భావోద్వేగంగా పలికారు.
గత ప్రభుత్వం పెట్టిన అప్పుల భారాన్ని సీఎం ప్రస్తావించారు. "పదేళ్లలో 8 లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. "ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది" అని పునరుద్ఘాటించారు.
"18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం" అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానంగా, "ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం" అని సవాలు విసిరారు.
"రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం" అని తమ ప్రభుత్వ పనితీరును వివరించారు. "చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది" అని ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.
"కొంత కాలమైనా సమయం ఇవ్వరా..? సరిదిద్దుకొనివ్వరా?" అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఉండేదని, తమ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని అన్నారు.
"ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు" అని తమ ప్రభుత్వ ఘనతను చాటుకున్నారు. "మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం" అని విద్యార్థులు, యువతకు భరోసా ఇచ్చారు.
చివరగా, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు ప్రకటించారు. "రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా. రైతులు పంట మార్పిడి చేయండి" అని పిలుపునిచ్చారు. "భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది" అని భరోసా ఇచ్చారు.
"ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గులేకుండా మనల్ని విమర్శిస్తున్నారు" అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.