తెలంగాణ ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.
రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సీజన్ కు ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తుంది. మొత్తం రెండు సీజన్లలో రూ.12 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 26న రైతు భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఫిబ్రవరి 5, 11 తేదీల్లో రెండు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ చేశారు.
నాలుగు ఎకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు అందలేదు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రబీ సీజన్‌కు నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
రైతు భరోసా నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్ది ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వచ్చే వారంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్ష అనంతరం రైతు భరోసా చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల జమ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్ లో భాగంగా రైతుల అకౌంట్లలోకి రూ.6 వేల చొప్పున నిధులను జమ చేశారు. మూడు దశల్లో నాలుగు ఎకరాల వరకు రైతులకు నిధులు అందించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎకరాలకిపైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రబీ సీజన్ లో డబ్బులు జమ కానీ వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో పెట్టుబడిసాయం నిధులు జమ అవుతాయని ఆశిస్తున్నారు.
జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ నెల లోగా రబీ సీజన్‌కు రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జులై నుంచి ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
సంబంధిత కథనం