TG Employees Fight: సమ్మె బాట పట్టనున్న తెలంగాణ ఉద్యోగ, కార్మిక సంఘాలు.. నవంబర్‌ 2 నుంచి ఉద్యోగుల ఆందోళనలు-telangana employment and labor unions to go on strike employee concerns from november 2 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Employees Fight: సమ్మె బాట పట్టనున్న తెలంగాణ ఉద్యోగ, కార్మిక సంఘాలు.. నవంబర్‌ 2 నుంచి ఉద్యోగుల ఆందోళనలు

TG Employees Fight: సమ్మె బాట పట్టనున్న తెలంగాణ ఉద్యోగ, కార్మిక సంఘాలు.. నవంబర్‌ 2 నుంచి ఉద్యోగుల ఆందోళనలు

TG Employees Fight: వేతన సవరణ, డిఏ బకాయిల చెల్లింపు సహా ఇతర అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పోరుబాట పడుతున్నట్టు ప్రకటించారు. నవంబర్ 2 నుంచి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు పూర్తైనా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు.

సమ్మె కార్యాచరణ వెల్లడిస్తున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

TG Employees Fight: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడుతున్నట్టు ప్రకటించాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో మార్పు వస్తుందని భావించినా అది జరగలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలలైనా వాటిని పరిష్కరించ లేదని విధిలేని పరిస్థితుల్లో ఉద్యమబాట పడుతున్నట్టు తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది.

తెలంగాణ ఎన్జీవో కేంద్ర కార్యాలయంలో మంగళవారం 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షవర్ల, కార్మిక సంఘాలతో కూడిన తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్ర టరీ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఇప్పటికే ఐదు డిఏలు బకాయిలో ఉండటం చరిత్రలో ఎన్డూ చూడలేదని జేఏసీ నేత జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారు. బకాయిలు చెల్లించాలని, తమ పొదుపు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాలిచ్చినా కనీసం చర్చించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దసరాలోగా రెండు డీఏలు వస్తాయని ఆశలు పెట్టుకున్నామని, ఇప్పుడు దీపావళి పై ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వాలు గౌరవం లేకుండా చేశాయని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు ప్రధాన డిమాం డ్లను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోలేదని జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల 44 ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కూడా చొరవ తీసుకోలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్క రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని చర్చిస్తే వాటిని పరిష్కరించవచ్చన్నారు.

ఉద్యోగుల ఆరు ప్రధాన డిమాండ్లు ఇవే..

  • 2022 జులై 1 నుంచి పెండింగ్లో ఉన్న అయిదు డీఏలను విడుదల చేయాలి. బకాయిలను నగదు రూపంలోనే చెల్లించాలి.
  • పెండింగులో ఉన్న అన్ని బిల్లులను మంజూరు చేయాలి. ఇ-కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలి. ఖజానా శాఖ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి.
  • ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. 2వ వేతన సంఘం (పీఆర్సీ) సిఫార్సుల నివేదికను తెప్పించుకొని అమలు చేయాలి.
  • ప్రభుత్వం, ఉద్యో గులు/ పెన్షనర్ల కంట్రిబ్యూషన్‌లో సమానంగా ఎంప్లాయిస్ హెల్త్‌ స్కీమ్‌ అమలు చేయాలి.
  • సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పున రుద్దరించాలి.
  • జీవో 317ను సమీక్షిం చాలి. బాధితుల ఫిర్యా దులన్నీ పరిష్కరించాలి.

జేఏసీ ఉద్యమ ప్రణాళిక ఇది…

నవంబరు 2: అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖల అందచేస్తారు

నవంబర్ 4, 5 తేదీలు: జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పిస్తారు.

నవంబర్ 6వ తేదీ: ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు.

నవంబర్ 7 నుంచి డిసెంబరు 27 వరకు: డిమాండ్ల పరిష్కారం కోసం 10 ఉమ్మడి జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తారు.

జనవరి 3-4 వరకు: నల్లబ్యాడ్జీలతో విధులకు.. భోజన విరామంలో నిరసనలు చేపడతారు.

జనవరి 21: తెలంగాణలోని జిల్లాల్లో మౌన ప్రదర్శనలు నిర్వహిస్తారు.

జనవరి 23వ తేదీ: రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు.

జనవరి 30వ తేదీ: రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల వద్ద మానవహారాలతో నిరసన చెబుతారు.