TG DSC Results 2024 : ఆలస్యం కాన్నున డీఎస్సీ ఫలితాలు..! కారణం ఇదే
TG DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షా ఫలితాల వెల్లడికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. డీఎస్సీ కీపై అభ్యంతరాలు వెల్లువెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. దీంతో ఫైనల్ కీని నిపుణుల కమిటీకి పంపించే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ 2024 డీఎస్సీ ఫైనల్ ‘కీ’పై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు వచ్చాయి. చాలామంది అభ్యర్థులు పుస్తకాలు తీసుకొని ఎస్సీఈఆర్టీ ఆఫీస్కు వచ్చారు. తమ అభ్యంతరాలను అధికారులకు వివరించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి డీఎస్సీ తుది ‘కీ’ని విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. దీంతో అభ్యర్థులు తమ అభ్యంతరాలను చెప్పేందుకు ఎస్సీఈఆర్టీ కార్యాలయానికి క్యూ కట్టారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం 2.45 లక్షల మంది పోటీపడ్డారు.
నిపుణుల కమిటీదే నిర్ణయం..
పలు ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల అభ్యంతరాలపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. తుది ‘కీ’పై అభ్యంతరాలు రావడంతో.. డీఎస్సీ, టెట్ మార్కులను కలిపి ఇచ్చే జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తుది కీ వెల్లడించినప్పుడు.. వారం రోజుల్లో జనరల్ ర్యాంకు జాబితా వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. కానీ.. అభ్యంతరాల కారణంగా ఆలస్యమవుతుందని భావిస్తున్నారు
తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ లు వచ్చేశాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందవచ్చు. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లపై భారీగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన విద్యాశాఖ.. శుక్రవారం ఫైనల్ కీని ప్రకటించింది.
ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. దాదాపు 10 రోజులకుపైగా అభ్యంతరాల పరిశీలను చేపట్టింది.
త్వరలోనే ఫలితాలు!
ఫైనల్ కీ విడుదల కావటంతో త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారు. మెరిట్ జాబితా జారీ విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది.
ఫలితాల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి గురువారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలు వారం రోజుల్లో విడుదలవుతాయని చెప్పుకొచ్చారు. దీంతో అతి తొందర్లోనే డీఎస్సీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.
డీఎస్సీ కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
డీఎస్సీ రిక్రూట్ మెంట్ - 2024 ఆప్షన్ పై నొక్కాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ కనిపించే హోం పేజీలో ఫైనల్ కీ అనే ఆప్షన్ ఉంటుంది.
దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ సబ్జెక్టుల వారీగా డిస్ ప్లే అవుతుంది.
మీరు రాసిన పరీక్ష పేపర్ పై క్లిక్ చేస్తే కీ ఓపెన్ అవుతుంది.
డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.