TSLPRB Mains Key: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మెయిన్స్ కీ విడుదల-telangana constable recruitment mains exam key released by police recruitment board ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tslprb Mains Key: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మెయిన్స్ కీ విడుదల

TSLPRB Mains Key: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మెయిన్స్ కీ విడుదల

HT Telugu Desk HT Telugu
May 22, 2023 08:47 AM IST

TSLPRB Mains Key: తెలంగాణలో కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన తుది పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అభ్యంతరాలను 24వ తేదీ లోపు బోర్డుకు తెలియచేయాల్సి ఉంటుంది.

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు

TSLPRB Mains Key: తెలంగాణలో రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల కీ విడుదలైంది. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది.

పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ www.tslprb.in లో అందుబాటులో ఉంటుంది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతోపాటు ఎక్సైజ్, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి గత నెలలో తుది పరీక్ష నిర్వహించారు. ఇందులో డ్రైవర్లు, మెకానిక్‌ వంటి కానిస్టేబుల్‌ సమాన స్థాయి పోస్టులూ ఉన్నాయి. శాఖల వారీగా తుది పరీక్ష నిర్వహించారు.

మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులకు ఏవైనా ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్లోనే తెలుపవచ్చు. ఒక్కో అభ్యంతరానికి ఒక్కో టెంప్లెట్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించే ఆధారాలను కూడా అందులోనే అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ నెల 24 వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

అభ్యంతరాల కోసం ప్రత్యేక ఫార్మాట్ ను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫైనల్ కీ విడుదల చేసే సమయంలో ఓఎంఆర్‌ షీట్లను వెబ్ సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నట్లు పేర్కొంది.

తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పోలీస్ నియామక బోర్డ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహించారు. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించారు. ఇందులో 1,08,055 మంది మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యారని బోర్డు తెలిపింది.

తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ (సివిల్/ఎ.ఆర్/ టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఏప్రిల్ 30న తుది రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 98.53 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి వెబ్ సైట్ లో విడుదల చేసింది. పీసీ ఐటీ పోలీస్ పరీక్షకు 6,801 మంది అర్హత సాధించగా, 6,088 మంది పరీక్షకు హాజరయ్యారు.