Telangana Congress : ఫిబ్రవరి 6 నుంచి టీ కాంగ్రెస్ పాదయాత్ర.. రేవంత్ ఏమన్నారంటే.. ?-telangana congress to start two months padayatra from february 6th revanth says all leaders will join ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Congress To Start Two Months Padayatra From February 6th Revanth Says All Leaders Will Join

Telangana Congress : ఫిబ్రవరి 6 నుంచి టీ కాంగ్రెస్ పాదయాత్ర.. రేవంత్ ఏమన్నారంటే.. ?

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 06:05 PM IST

Telangana Congress : రాష్ట్రంలో కాంగ్రెస్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 26న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి.. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర చేపట్టాలని హస్తం నేతలు తీర్మానించారు. ముఖ్యనేతలంతా యాత్రలో పాల్గొంటారని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు (facebook)

Telangana Congress : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రపై క్లారిటీ వచ్చింది. పార్టీ అధిష్టానం తలపెట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టే తీరుపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సమావేశమైన నేతలు.... జనవరి 26న హాత్ సే హాత్ జోడో యాత్రను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు యాత్ర చేపట్టాలని తీర్మానించారు. తెలంగాణలో యాత్ర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ లేదా ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తూ తీర్మానం చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ శాసనసభ పరిధిలోని బిజినేపల్లి మండలంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో మాణిక్ రావు ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.

ట్రెండింగ్ వార్తలు

పాదయాత్ర చేపట్టే విధానం, అనుసరించాల్సిన వ్యూహాలపై మాణిక్ రావు ఠాక్రే నేతలకు దిశా నిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి కనీసం 50 నియోజకవర్గాలకు తగ్గకుండా పాదయాత్ర చేయాలని... మిగతా సీనియర్లు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టాలని ఠాక్రే సూచించినట్లు సమాచారం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతలంతా కలిసి పనిచేయాలని... యాత్రను విజయవంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సమస్యలు ఉంటే తనతో చెప్పాలని.. లీడర్లు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఠాక్రే హామీ ఇచ్చారని సమాచారం. నేతలు ఎవరైనా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించవచ్చని... అయితే అవి పార్టీకి నష్టం చేసేలా ఉండకూడదని మాణిక్ రావు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలలపాటు పాదయాత్ర ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ యాత్రలో పాల్గొంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించామని వెల్లడించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ... ప్రజాస్వామ్యంపై ప్రజల్లో తిరిగి విశ్వాసం కల్పించారని రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా.. రాహుల్ గాంధీ సందేశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 26న లాంఛనంగా ప్రారంభించి.. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు నిర్విరామంగా యాత్ర జరగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతామని, ప్రతి వ్యక్తినీ కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై ఛార్జి షీటు విడుదల చేస్తామని చెప్పారు. యాత్ర ప్రారంభానికి రెండు, మూడు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని.. భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ నుంచి యాత్ర ప్రారంభించాల్సిందిగా ఆహ్వానాలు అందుతున్నాయని చెప్పారు. ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అధిష్టానం అనుమతితో ఎక్కడి నుంచి మొదలుపెట్టేది ప్రకటిస్తామని అన్నారు.

మాణిక్ రావు ఠాక్రే నేతృత్వంలో తామందరం సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని రేవంత్ స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకుని ఐక్యంగా కదులుతామని చెప్పారు. భేటీకి మూడుసార్లు రాని నేతల నుంచి మాణిక్ రావు ఠాక్రే వివరణ తీసుకుంటారని తెలిపారు.

WhatsApp channel