Telangana Congress : ధరణి పోర్టల్ సమస్యలపై “కాంగ్రెస్ హామీ కార్డు”
Telangana Congress : ధరణితో సమస్యలు ఎదుర్కుంటున్న రైతులకు అండగా నిలస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ హామీ కార్డు పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో ధరణి అదాలత్ నిర్వహించిన కాంగ్రెస్.... రైతులకి హామీ కార్డులు అందజేసింది.
Telangana Congress : ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఇతర భూ యజమానులకు “కాంగ్రెస్ హామీ కార్డు” పేరిట కార్డులు అందజేస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో ‘ధరణి అదాలత్’ పేరిట పైలెటె ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత కొప్పుల రాజు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హామీ కార్డులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలంలో ఐదుగురు “భూరక్షక్ ”లను నియమిస్తుంది. వీరికి ధరణి పోర్టల్, భూ సమస్యల మీద ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈ భూరక్షకులు ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో ధరణి అదాలత్ పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, ఇతరుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. అనంతరం ధరణి బాధితుల పూర్తి వివరాలతో కూడిన “కాంగ్రెస్ హామీ కార్డు” ను సదరు బాధితులకు అందజేస్తుంది.
ధరణ పోర్టల్ ద్వారా ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా పరిష్కరిస్తామనే హామీతో ఈ కార్డు బాధితులకు అందచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ హామీ కార్డును బాధితులు తమ మండలానికి చెందిన స్థానిక తాహసిల్ధార్, మండల రెవిన్యూ అధికారికి చూపించటం ద్వారా ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ఇవాళ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో జరిగిన ధరణి అదాలత్ లో 31 మంది రైతులకు “కాంగ్రెస్ హామీ కార్డు”లను అందజేశారు. ఉన్న భూమి ధరణిలో నమోదు కాకపోవడం... ఉన్నదాని కన్నా ధరణిలో తక్కువ చూపించడం... అసైన్డు భూములలో ఇబ్బందులు... పట్టా పాసు పుస్తకం జారీ కాకపోవడం.. వారసత్వ భూముల మ్యూటేషన్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకి కాంగ్రెస్ హామీ కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పేదల కోసం కాదని, భూస్వాముల కోసం మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ధరణి అదాలత్ నిర్వహించి బాధితుల నుండి దరఖాస్తు స్వీకరించి వారికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. 2024 జనవరి 1 తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపడుతుందని, అప్పటినుండి 100 రోజుల్లో ధరణి సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ధరణి పోర్టల్ ను ఫిలిపిన్స్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయని జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సర్వే చేయిస్తామని... రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు .. 30 వేల జీఓలు ఉన్నాయని... అన్నింటినీ కలిపి ఒకే చట్టం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. భూయజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో భూమి సేకరించవద్దని 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధించడమే కాకుండా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. తెలంగాణ లో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని... వారికి ప్రభుత్వం నుంచి సహాయం లభించడం లేదని జైరాం రమేశ్ విమర్శించారు.