Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పోస్టు.. ఢిల్లీలో బీజేపీకి ఆయుధం.. రాహుల్ గాంధీ సీరియస్!
Telangana Congress : కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి వేరే వాళ్లు అవసరం లేదు.. ఆ పార్టీ వారే చాలు.. అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అది వారికున్న అనుభవమో.. అంతకు ముందు జరిగిన పరిణామాలో తెలియదు. కానీ.. తాజా పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ.. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా.. తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ నేతలు ముందుంటారు. అది వారి రాజకీయ వ్యూహంలో భాగం కావొచ్చు. అలాంటి బీజేపీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం. ఇలాంటి తరుణంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ.. కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ఆయుధాలు అందిస్తోంది.

బీజేపీకి ఆయుధంగా..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాన్ని దక్కించుకుంది. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ అసలే కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఏ పొరపాటు జరిగినా దాన్ని రాజకీయంగా వాడుకుంటారని.. సీఎం కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఓ పోస్టు పెట్టింది. అది తెలంగాణలో కేసీఆర్‌కే కాకుండా.. ఢిల్లీలో బీజేపీకి ఆయుధంగా మారింది.
పోల్ సర్వే చేసేందుకు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. సోషల్ మీడియాలో పెట్టిన పోల్ సర్వే తాజాగా వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోల్ సర్వే చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ అది బూమరాంగ్ అయ్యింది. కాంగ్రెస్ పాలనకు అనుకూలంగా, కేసీఆర్ పాలనకు మద్దతు ఇస్తూ నెటిజన్ల నుంచి ఓట్లు రావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఫామ్‌హౌస్ వర్సెస్ ప్రజల వద్దకు పాలన..
తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్‌లో జనవరి 29వ తేదీన పోల్ సర్వే చేపట్టారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? అనే ప్రశ్న పెట్టారు. దాని కింద రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి ఫామ్ హౌస్ పాలన (బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి), రెండోది ప్రజల వద్దకు పాలన (కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి) ఆప్షన్లు ఇచ్చారు.
ఫామ్‌హౌస్ పాలనకు ఎక్కువ ఓట్లు..
ఈ సర్వేలో మొత్తం 92 వేలకు పైగా ఓట్లు పోలైనట్లుగా తెలిసింది. మొదటి ఆప్షన్ (ఫామ్ హౌస్ పాలన)కు దాదాపు 70 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. రెండో ఆప్షన్ (ప్రజల వద్దకు పాలన)కు 30 శాతం లోపు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ఒకటి అనుకుంటే.. మరొకటి జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సోషల్ మీడియా బృందం దాన్ని తొలగించినట్టు తెలిసింది. కానీ కాస్త అలస్యం అయ్యింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రాహుల్ సీరియస్..
ఈ పోల్ సర్వేకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఢిల్లీకి చేరింది. దీన్ని బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. అక్కడి ప్రజలే కాంగ్రెస్ పార్టీని వద్దంటున్నారని.. అందుకు ఉదాహరణ ఈ పోల్ పోస్టు అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్టు అయ్యింది. ఈ ఇష్యూపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ దూకుడు..
ఢిల్లీలో బీజేపీ వాడుకుంటే.. ఇక్కడ కేసీఆర్ తన స్టైల్‌లో ఈ పోస్టుపై రియాక్ట్ అయ్యారు. 'కాంగ్రెస్ వాళ్లే పోలింగ్ పెట్టారు. ఆ పోల్‌లో 70 శాతం బీఆర్‌ఎస్‌కు మద్దతు వచ్చింది. 30 శాతం వాళ్లకు వచ్చిందట' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ పోల్ సర్వే స్క్రీన్ షాట్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.