T Congress MP Candidates : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్​ కేటుగాళ్ల వల - బీఫామ్ కోసం డబ్బులు కట్టాలంటూ ఫోన్ కాల్స్..!-telangana congress mp candidates are being called by cyber crooks asking them to pay money for b farm ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  T Congress Mp Candidates : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్​ కేటుగాళ్ల వల - బీఫామ్ కోసం డబ్బులు కట్టాలంటూ ఫోన్ కాల్స్..!

T Congress MP Candidates : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్​ కేటుగాళ్ల వల - బీఫామ్ కోసం డబ్బులు కట్టాలంటూ ఫోన్ కాల్స్..!

HT Telugu Desk HT Telugu
Apr 04, 2024 03:05 PM IST

Telangana Congress MP candidates: తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు( T Congress MP candidates) గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బీఫామ్ పేరుతో డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు ఇదే తరహా కాల్ చేశారు. అప్రమత్తమైన ఆమె గాంధీ భవన్ కు సమాచారం ఇచ్చారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్​ కేటుగాళ్ల వల
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్​ కేటుగాళ్ల వల

Phone Calls to Congress MP candidates : పార్లమెంట్​ ఎన్నికలు (Loksabha Elections 2024) సమీపిస్తున్న వేళ.. సైబర్​ నేరగాళ్లు కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థులను టార్గెట్​ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల లిస్ట్ (Telangana Congress MP Candidates)​ చేతిలో పట్టుకుని, వారందరికీ ఫోన్​ కాల్​ చేసి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. బీ ఫామ్​ రెడీ అయ్యిందని, డబ్బులు అకౌంట్​ కు పంపిస్తే వెంటనే బీ ఫామ్​ చేరవేస్తామని చెప్పి అభ్యర్థులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో అభ్యర్థులు సైబర్​ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడియం కావ్యకు కాల్…

బుధవారం రాత్రి సమయంలో వరంగల్ కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యకు(Kadiyam Kavya) గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. తాము ఏఐసీసీ నుంచి మాట్లాతున్నామని, కావ్య పేరున బీ ఫామ్​ రెడీ అయ్యిందని చెప్పారు. బీ ఫామ్​ పంపడానికి రూ.76 వేలు తమ ఖాతాకు ట్రాన్స్​ ఫర్​ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు ఓకే చెప్పి కాల్​ కట్​ చేసిన కాంగ్రెస్​ అభ్యర్థి కావ్య, అనుమానంతో వెంటనే అలర్ట్ అయి గాంధీభవన్​ కు ఫోన్​ చేసి ఆరా తీసింది. కానీ అదంతా ఫేక్ అని అక్కడి నుంచి సమాచారం అందడంతో డబ్బులు పంపకుండా వదిలేశారు.

గాంధీ భవన్ నుంచే అభ్యర్థుల లిస్ట్​!

సైబర్​ నేరగాళ్లు మొదట కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ గాంధీ భవన్​ కే కాల్​ చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్​ చేస్తున్నామని పార్టీ ఆఫీస్​ కు కాల్​ చేసి, తెలంగాణలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా పంపాల్సిందిగా గాంధీభవన్​ సిబ్బందిని అడిగారు. దీంతో ఎన్నికల సమయం కావడం, పైగా ఏఐసీసీ(AICC) ఆఫీస్​ నుంచి కాల్​ చేస్తున్నట్టు చెప్పడంతో అక్కడి సిబ్బంది నిజమే కావచ్చునని అభ్యర్థుల వివరాలు అందించారు. దీంతో ఆ సమాచారం ఆధారంగా సైబర్​ నేరగాళ్లు ఒక్కో అభ్యర్థికి ఫోన్​ చేసి డబ్బులు డిమాండ్​ చేయడం మొదలు పెట్టారు. కడియం కావ్యతో పాటు రాష్ట్రంలోని మరికొంతమంది అభ్యర్థులకు కూడా కాల్​ చేసి డబ్బులు డిమాండ్​ చేసినట్లు తెలిసింది. కొందరి నుంచి రూ.99 వేల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా అభ్యర్థులందరికీ ఫోన్​ చేస్తున్న సైబర్​ కేటుగాళ్లు డబ్బులు బీ ఫామ్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా గాంధీ భవన్​ కు సమాచారం అందించడంతో విషయం కాస్త బయటపడింది. కాగా అభ్యర్థులెవరూ డబ్బులు పంపించకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో సైబర్​ కేటుగాళ్ల ప్లాన్​ బెడిసి కొట్టినట్లయ్యింది.

అలర్ట్​ గా ఉండాలని ఏఐసీసీ సూచన

కాంగ్రెస్​ అభ్యర్థులను సైబర్​ నేరగాళ్లు టార్గెట్​ చేసిన నేపథ్యంలో విషయం ఏఐసీసీ వరకు చేరింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తీరుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ కాంగ్రెస్​ పార్టీ నేతలు, అభ్యర్థులకు సూచనలు ఇచ్చింది. బీ ఫామ్​ లకు డబ్బులు అడిగితే ఎవరూ పంపొద్దని, సైబర్​ నేరగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురి ఇలా సైబర్​ నేరగాళ్లు కాల్​ చేసి డబ్బులు డిమాండ్​ చేయగా.. ఎవరూ పంపాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవల కాలంలో సైబర్​ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండగా... జనాలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.