Telangana Congress Meeting : కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ముందు బీఆర్ఎస్ నేతల ఫోజులు... రేవంత్ రెడ్డి-telangana congress meeting in nagarkurnool revanth reddy fires on brs government and kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Congress Meeting In Nagarkurnool Revanth Reddy Fires On Brs Government And Kcr

Telangana Congress Meeting : కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ముందు బీఆర్ఎస్ నేతల ఫోజులు... రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Jan 22, 2023 09:06 PM IST

Telangana Congress Meeting : ఉమ్మడి మహబూబ్ నగర్ లో 14 సీట్లలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని... రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తోందని... కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ నేతలందరం ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ లో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినదించారు.

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ సభ
నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ సభ

Telangana Congress Meeting : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు అందరం కలిసి ఐక్యంగా పోరాడతామని కాంగ్రెస్ నేతలు నినదించారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ పేదలను మోసం చేస్తోందని.. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని..... నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ వేదికగా నినదించారు. 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని... మళ్లీ ఓట్ల కోసం వచ్చే కేసీఆర్ ని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.... బీఆర్ఎస్ దొరల పార్టీ అని.. బీజేపీ పెట్టుబడిదారుల కోసం పనిచేసే పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని చెప్పారు. దళితుడుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్... 8 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగను 3 నెలలు జైల్లో పెట్టారని... ప్రవీణ్ కుమార్, అనుకూరి మురళిలను ఉద్యోగం నుంచి తొలగేలా చేశారని, ప్రదీప్ చంద్రను అవమానించారని అన్నారు. అంబేడ్కర్ కు దండ వేయని వారు.. జయంతి, వర్ధంతి నిర్వహించని వారు... ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని.. పేదలకు ఇంతకంటే అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడు ఆ ప్రాజెక్టుల ముందు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పంచ కట్టుకొని ప్రాజెక్టుల వెంట తిరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి కాలేరని..సెటైర్ వేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన నాగం జనార్దన్ రెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందన్న రేవంత్.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 సీట్లు గెలిచి.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ నిర్ణయించిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్లి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెడతామని అన్నారు. కాంగ్రెస్ లో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు.

దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని... కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే విమర్శించారు. తెలంగాణలో పరిస్థితులు మారాలని అన్నారు. దళితులు, గిరిజనులకు అవమానం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీసులు నాయకులకు తొత్తులుగా ఉండొద్దని హితవు పలికారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నల్లమట్టి, ఇసుక అమ్ముకుంటున్నారని... నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలని బెదిరించి, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, రోహిత్ చౌదరి, నదీం జావెద్ తదితరులు సభలో పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు సభకు తరలివచ్చారు.

WhatsApp channel