గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి-telangana cm revanth reddy orders probe into gulzar house fire incident 17 died tragedy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. ఫైర్, పోలీస్ సిబ్బంది సకాలంలో స్పందించి 40 మందిని సకాలంలో రక్షించారన్నారు.

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

సీఎం విచారం వ్యక్తం

భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం... అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్​లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మెరుగైన వైద్యం అందించేలా

సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్​, ఐజీ నాగిరెడ్డిని ఫోన్ లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా సీఎం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

బాధితులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం

అక్కడున్న బాధిత కుటుంబీకులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

40 మందిని రక్షించారు

ఫైర్​ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్​ టీమ్​ తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు.

కేసీఆర్ విచారం వ్యక్తం

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అభాగ్యులు మృత్యువాత పడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర సంతాపం ప్రకటించారు.

అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం