CM Revanth On PM Modi : 'మోదీజీ.. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం' - సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా.. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని అంశాలను ప్రస్తావించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాల్లోని ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి,ఆర్థిక స్థితి రోజురోజుకూ దిగజారుతోందంటూ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు స్కీమ్, విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుతో పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు.
ప్రియమైన మోదీజీ… మీరు తెలంగాణ ప్రభుత్వం గురించి చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు లెవెనత్తిన అపోహాలపై క్లారిటీ ఇస్తున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
డిసెంబర్ 7, 2023 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ దుష్ట పాలన పోయిన తర్వాత… రాష్ట్రంలోని ప్రజల్లో ఆశలు చిగురించాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెల్లోలనే… TGSRTC బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అమలు చేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య బీమాను కూడా ఇస్తోందని పేర్కొన్నారు. గడిచిన 11 నెలల్లో తెలంగాణాలోని మహిళలు రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తమ ప్రభుత్వానికి ఏడాది కూడా పూర్తి కాకముందే… రైతుకు భరోసానిచ్చేలా రుణమాఫీని అమలు చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 22 లక్షల 22 వేల మంది రైతుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. కేవలం 25 రోజుల్లోనే 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచిత విద్యుత్ ను కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం రూ. 500కే సిలిండర్ లభిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహిస్తోందని తెలిపారు. 50 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని వివరించారు. సంక్షేమ పాఠశాలల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లలో ఆక్రమణలకు గురై, ధ్వంసమైన సరస్సులు, నాలాలను రక్షించే దిశగా అడుగులు వేశామని పేర్కొన్నారు. ప్యూచర్ సిటీని రూపొందించబోతున్నామని… మాస్టర్ ప్లాన్ కూడా ఖరారు చేశామని పేర్కొన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు.