TG Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు-telangana caste census dial a number get your details recorded at home ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

TG Caste Census : తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 15, 2025 10:32 PM IST

TG Caste Census : తెలంగాణలో మరోసారి కులగణన జరగనుంది. అయితే గతంలో పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ఈసారి అవకాశం కల్పించారు. ఈ నెల 16 నుంచి 28 వరకు కులగణనలో పేర్లు నమోదు ప్రక్రియ కొనసాగనుంది.

తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు
తెలంగాణలో కులగణన సర్వే, ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి వివరాలు నమోదు

TG Caste Census : కులగణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు గతంలో కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాలు నమోదు చేయనున్నారు. కులగణన వివరాల నమోదు చేసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 040-211 11111ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు... ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

కులగణన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు గుర్తించారు. అలాగే https://seeepcsurvey.cgg.gov.in లో సర్వే ఫారం డౌన్‌లోడ్ చేసుకుని ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చు.

సర్వే పాల్గొనని 3.1 శాతం మంది

కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల తెలిపారు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసమే మళ్లీ రీసర్వే చేయనున్నట్లు స్పష్టం చేశారు. రీసర్వేలో పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా వివరాలు చెప్పలేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగా సర్వేకు సహకరించలేదన్నారు. బీసీల రిజర్వేషన్లపై మార్చి తొలి వారంలో కేబినెట్ తీర్మానం చేస్తామని భట్టి వివరించారు. శాసనసభ ముందుకు ఈ బిల్లును తీసుకువచ్చి చట్టబద్ధం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.

కులగణన సర్వే గణాంకాలు

కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేసినట్లు వెల్లడించింది. మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేసుకున్నాయని పేర్కొంది. కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం మాత్రమని తెలిపింది. సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతంగా పేర్కొంది. బీసీల జనాభా 46.25 శాతం ఉందని వెల్లడించింది. ఓసీలు 15.79 శాతం మంది ఉన్నారని, ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం ఉందని వెల్లడించింది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం