Hydra Act: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ, హైడ్రాకు చట్టబద్దత దిశగా అడుగులు, హైడ్రాపై కీలక నిర్ణయం
Hydra Act: నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమణల తొలగింపుపై హైడ్రా చేపట్టిన చర్యల్ని కొనసాగించడానికి వీలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైడ్రా చట్టబద్దతపై కోర్టు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Hydra Act: హైదరాబాద్ ఆక్రమణల తొలగింపుపై దూకుడుగా ముందుకు వెళుతున్న హైడ్రాకు మరింత పదును తెచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. నేేడు జరుగనున్న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో హైడ్రాపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు, నీటి వనరుల్లో నిర్మాణాల తొలగింపు వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగుతుండటంతో హైడ్రాను మరింతగా బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కార్యకలాపాలకు ఎలాంటి అటంకాలు లేకుండా చూసేందుకు చట్టబద్దత దిశగా అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల నీట వనరుల ఆక్రమ ణలు, అక్రమ కట్టడాల తొలగింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని మరింత బలోపేతం చేయనుంది. ఇందుకోసం దానికి చట్టబద్దత కల్పించాలని యోచిస్తోంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం- 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురావా లని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది.
శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణ యాలు తీసుకోనున్నారు. హైడ్రాను పటిష్ఠం చేయడానికి అవసరమైన నిర్ణయాలను క్యాబినెట్‌లో ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలపై ఇప్పటికే పలువురు న్యాయస‌్థానాలను ఆశ్రయించారు. హైడ్రా చట్టబద్దతను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా హైడ్రా కార్యకలాపాలను కొనసాగించేలా పలు ప్రభుత్వ శాఖల్లోని చట్టాల్లో సవరణలు తీసుకురానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ అమోదం తర్వాత హైడ్రా ఏర్పాటుపై ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
క్యాబినెట్‌లో కీలక అంశాలు..
తెలంగాణ క్యాబినెట్‌లో కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరును, హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఖరారు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు.
వీటితో పాటు తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవడం, కేంద్రానికి జరిగిన నష్టంపై నివేది కను పంపించడంపై చర్చిస్తారు. బాధితులను ఆదుకోడానికి కేంద్రాన్ని నిధులు కోరడం తదితర అంశాలపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు.
హైడ్రాకు చట్టబద్దత లేదన్న ఈటల
హైడ్రాకు చట్టబద్దత లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు తప్పులు చేస్తే తాను సరి చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని, హైడ్రాను చట్టబద్దమైన సంస్థగా రూపొందించాలని హితవు పలికారు.