Telangana Cabinet Meeting : ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!
Telangana Cabinet Meeting Updates : ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలతో పాటు ఆరు గ్యారెంటీల హామీలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
Telangana Cabinet Meeting 2024: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల అంశంకు కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్దెట్ కాకుండా…. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. ఇదే సమావేశంలో ఆరు గ్యారెంటీల హామీలపై చర్చించనున్నారు. ఇవే కాకుండా పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.
రూ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ రెండు పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన దరఖాస్తులకు(Praja Palana Applications) సంబంధించి అర్హుల ఎంపిక ఏ విధంగా చేపట్టాలి...? ఏ అంశాలను ప్రమాణికంగా తీసుకోవాలనే అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో రెండు హామీలకు ఆమోదముద్ర వేస్తారా లేక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. నెంబర్ ప్లేట్లపై టీఎస్ కు బదులు టీజీగా మార్చే విషయంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ కేబినెట్ భేటీ కోసం దాదాపు 20 నుంచి 25 అంశాలతో అజెండా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నిశాఖల నుంచి సమాచారం ఇవ్వాలంటూ కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
బడ్జెట్ సమావేశాలపై చర్చ…!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 8 లేదా 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ్టి కేబినెట్ భేటీలో సమావేశాలపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి కూడా ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈసారికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (Business Advisory Committee) సమావేశంలో నిర్ణయించనున్నారు.