తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్న దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరలేదు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నప్పటికీ… ఖరారు మాత్రం కావటం లేదు. ఈ ఏడాది ఉగాది వేళ తప్పకుండా విస్తరణ ఉంటుందని భావించినప్పటికీ… జరగలేదు. అయితే తాజాగా మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనప్రాయంగా ధ్రువీకరించారు. శనివారం నిజామాబాద్ లో మాట్లాడిన ఆయన… పీసీసీ చీఫ్‌గా తనను కేవలం సలహాలు, సూచనలు మాత్రమే అడుగుతారని…. తుది నిర్ణయం మాత్రం పార్టీ హైకమాండ్ దే అంటూ ఓ ప్రశ్నకు జవాబునిచ్చారు. పీపీసీ చీఫ్ ప్రకటన ద్వారా…. మంత్రివర్గ విస్తరణ ఈసారి తప్పకుండా ఉండొచ్చన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతాయి.
2024, డిసెంబర్ 7వ తేదీకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయినా ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఆశావాహులు కూడా అలక పూనుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పూర్తిస్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేయాలని పార్టీలోని నేతలంతా కోరుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… కీలక నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం…. ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు రావటంతో మళ్లీ పాలనపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇదే సమయంలో పూర్తిస్థాయి కేబినెట్ టీమ్ తో ముందుకెళ్లాలని భావించినప్పటికీ… పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది.
మంత్రివర్గ విస్తరణ చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు కూడా వీటిని ఆశిస్తున్నారు. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరూ లేరు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేబినెట్ లో కొనసాగుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచి మాత్రమే ఖాతా తెరిచింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ పార్టీలో చేరారు. ఆయన సిటీ నుంచి కేబినెట్ బెర్త్ ను కోరుతున్నారు. ఆయనే కాకుండా పలువురు నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలనలో ఉంది. దాదాపు ఆయనకు ఖరారయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఈ కోణంలో ఒక్కరిద్దరి పేర్లు బలంగా తెరపైకి వస్తున్నాయి.
ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు కావటంతో…. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. దీంతో విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
ఆరు ఖాళీలు మాత్రమే ఉండి… ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు పరిశీలించిన హైకమాండ్…. త్వరలోనే పలువురి పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అవసరమైతే నాలుగు ఖాళీలను మాత్రమే భర్తీ చేసి… మరో రెండు ఖాళీలను తర్వాత భర్తీ చేసే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. వీటిపై ఈనెలాఖారులోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.