TG Cabinet Expansion : అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా?-telangana cabinet expansion likely in last week of january ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cabinet Expansion : అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా?

TG Cabinet Expansion : అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా?

Basani Shiva Kumar HT Telugu
Jan 18, 2025 11:28 AM IST

TG Cabinet Expansion : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కానీ పూర్తి స్థాయిలో కేబినెట్ లేదు. ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ.. ఇంకా జరగలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తిగా ఉన్నారు. పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CMO)

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇటు ఏడాది దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

yearly horoscope entry point

రేవంత్ వచ్చాక..

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడైతే ఇద్దరు లేదా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుని.. మిగతా ఖాళీలను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భర్తీ చేయొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రనిధికి చెప్పారు.

అధిష్టానం క్లారిటీ..

ఇటీవల ఢిల్లీలో పర్యటించిన రేవంత్‌కు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. కేబినెట్‌లోని ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై కూడా జాబితాను సిద్ధం చేసి ఢిల్లీ పెద్దలకు రేవంత్ సమర్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఇంకా 6 ఖాళీలు..

2024, డిసెంబర్ 7వ తేదీకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయినా ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఆశావాహులు కూడా అలక పూనుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి, పార్టీ కొందరికి హామీ ఇచ్చింది. దీంతో తమకు ఇచ్చిన హామీ ఏమైందంటూ.. గెలిచిన నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

జనవరి 26 తర్వాత..

విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్... ఈ నెల 25న హైదరాబాద్‌కు రానున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించనున్నారు. దీని తర్వాత సీఎం జిల్లాల పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

ఇప్పుడు కాకపోతే..

ఒకవేళ అప్పుడు కేబినెట్ విస్తరణ జరగకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తోంది. అటు ఎవరెవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే అంశంపైనా సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలపై కసరత్తు జరిగినట్టు సమచారం. రెడ్డి కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు.

గట్టిగా ప్రయత్నాలు..

నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి.. మిగతా వాటిని కొంత కాలం పెండింగ్‌లో పెడతారనే చర్చ కూడా జరుగుతోంది.

ముగ్గురికి ఉద్వాసన..

మరోవైపు ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గుర్ని తప్పించే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గుర్ని తప్పిస్తే.. 9 ఖాళీలు అవుతాయి. దీంతో కీలక సామాజికవర్గాల ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ముదిరాజ్, మున్నూరు కాపు సామాజికవర్గాలకు కేబినెట్ విస్తరణలో అవకాశం లభించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Whats_app_banner